English | Telugu
బిగ్‌బాస్ హౌస్‌లోనే కంటెస్టెంట్ అరెస్ట్... షాక్ అయిన నిర్వాహకులు!
Updated : Oct 24, 2023
ఈమధ్యకాలంలో ఎక్కువ ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షోకి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా నెటిజన్లు ఎంతో ఆసక్తిగా దాన్ని ఫాలో అవుతారు. మొదట హిందీలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఈ షోను ఇప్పుడు వివిధ భాషల్లో విస్తరించారు. ఇప్పుడు పలు భాషల్లో ఈ షో సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ షోలో జరిగిన ఒక పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరగని ఓ ఘటన ఈ షోలో చోటు చేసుకుంది. అటవీ శాఖకు చెందిన కొందరు అధికారులు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి ఒక కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. కన్నడ భాషలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పులిగోరు గొలుసును ధరించిన కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సంతోష్‌పై కేసు నమోదు చేశారు. అయితే డైరెక్ట్‌గా బిగ్‌బాస్ హౌస్‌కి అధికారులు వెళ్ళడం వెనుక ఓ కారణం ఉంది. సంతోష్‌పై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు అతన్ని తమకు అప్పగించాలని కోరారు. అయితే దీన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీనిపై స్పందించిన అధికారులు వారికి సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. అప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు పులిగోరు అతనికి ఎలా అందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. త్వరలోనే కోర్టులో సంతోష్‌ను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి అరెస్ట్ ఘటన జరిగింది లేదు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.