English | Telugu
రానాకి ఈ సారైనా కలిసొచ్చేనా!
Updated : Dec 17, 2021
శేఖర్ కమ్ముల రూపొందించిన పొలిటికల్ డ్రామా `లీడర్` (2010)తో కథానాయకుడిగా పరిచయమైన రానా దగ్గుబాటి.. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్ గానూ, సహాయ నటుడిగానూ పలు విభిన్న వేషాల్లో కనిపించి అలరించాడు. 2017లో అయితే `ఘాజీ`, `బాహుబలి - ది కంక్లూజన్`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు చూశాడు. ఆ తరువాత మాత్రం తనకి సాలిడ్ సక్సెస్ లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. రాబోయే `1945`, `భీమ్లా నాయక్`, `విరాట పర్వం`పైనే ఆశలు పెట్టుకున్నాడు రానా. తక్కువ గ్యాప్ లోనే ఈ మూడు సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
డిసెంబర్ 31న `1945` రిలీజ్ కానుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న `భీమ్లా నాయక్` విడుదల కానుంది. ఇక `విరాట పర్వం` కూడా వచ్చే ఏడాది ఆరంభంలో సందడి చేయనుంది. కాగా, ఈ మూడు సినిమాల్లోనూ `భీమ్లా నాయక్`పైనే అందరి దృష్టి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ రీమేక్ యాక్షన్ డ్రామాలో మరో ప్రధాన పాత్రలో దర్శనమివ్వనున్నాడు రానా. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సంక్రాంతి సీజన్ లో రానాకి `భీమ్లా నాయక్` సెకండ్ రిలీజ్. గతంలో నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లోనూ, తను నారా చంద్రబాబు నాయుడుగా అతిథి పాత్రలోనూ నటించిన `ఎన్టీఆర్ కథానాయకుడు` (2019) పొంగల్ కే విడుదలైంది. భారీ అంచనాల నడుమ జనం ముందుకొచ్చిన సదరు బయోపిక్ ఆశించిన విజయం సాధించలేదు. మరి.. `భీమ్లా నాయక్` రూపంలోనైనా రానాకి ఫస్ట్ పొంగల్ హిట్ పడుతుందేమో చూడాలి.