English | Telugu
వీరమల్లుతో పవన్ కళ్యాణ్ వంద కోట్లు కొడతాడా..?
Updated : Jul 3, 2025
తెలుగునాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు పవర్ స్టార్. అలాంటి పవన్.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయారు. తన తోటి స్టార్స్ అంతా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరారు. ఈ ఫీట్ ని అందరికంటే ముందు సాధించగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా సాధించలేదు. దానికి కారణం ఆయన గత దశాబ్ద కాలంగా రాజకీయాలతో బిజీగా ఉండటమనే చెప్పవచ్చు.
గత పదేళ్లలో పవన్ నుంచి తక్కువ సినిమాలు వచ్చాయి. అవి కూడా రీమేక్ సినిమాలో లేదంటే తక్కువ టైంలో పూర్తయ్యే సినిమాలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా రాలేదు. ఇవి చాలదు అన్నట్లు.. టికెట్ ధరలు తక్కువ కారణంగా 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు వంద కోట్ల షేర్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి. ఇప్పుడు 'హరి హర వీరమల్లు'కి అలాంటి అడ్డంకులేమీ లేవు. 100 కోట్లు కాదు.. ఏకంగా 200 కోట్ల షేర్ కూడా సాధించే అవకాశముంది.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ భారీ సినిమా 'హరి హర వీరమల్లు' రూపంలో వస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ ఎట్టకేలకు జూలై 24న విడుదలవుతోంది. సినిమా బాగా ఆలస్యమవ్వడంతో అవుట్ పుట్ ఎలా ఉంటుందోనన్న అనుమానం అందరిలో ఉండేది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్.. ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. వీరమల్లు ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. ట్రైలర్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఇమేజ్ కి ఆ స్థాయి వసూళ్లు రావడం పెద్ద కష్టం కాదు. పవన్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పైగా చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో సనాతన ధర్మం గురించి ప్రస్తావన ఉంది. హిట్ టాక్ వస్తే.. వీరమల్లు మూవీ నేషనల్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.