English | Telugu
మళ్ళీ మెగా హీరోనే నమ్ముకున్న వినాయక్!
Updated : May 11, 2023
టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ మాస్ దర్శకుల్లో వి. వి. వినాయక్ ఒకరు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. కొంతకాలంగా వెనకబడిపోయారు. చివరిగా తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన 'ఇంటిలిజెంట్' 2018 లో విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో తెలుగులో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట. తెలుగులో ఏ హీరోతో అయితే తన ప్రయాణానికి బ్రేక్ పడిందో, ఆ హీరోతోనే రీఎంట్రీ ఇవ్వాలని వినాయక్ భావిస్తున్నారట.
సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఇంటిలిజెంట్' మూవీ 2018 ఫిబ్రవరిలో విడుదలై ఘోర పరాజయం పాలైంది. అసలు ఈ సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలిసుండదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి చేతులు కలుపుతున్నారు. ఇటీవల 'విరూపాక్ష'తో సాయి ధరమ్ బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో వినాయక్ తోనూ ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. తనకు 'ఇంటిలిజెంట్' రూపంలో ఫ్లాప్ ఇచ్చినప్పటికీ.. వినాయక్ సీనియారిటీని, ప్రతిభని నమ్మి ఏమాత్రం ఆలోచించకుండా ఆయనతో మరో సినిమా తీయడానికి సాయి ధరమ్ సిద్ధమవుతున్నాడట. అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. క్రైమ్ థ్రిల్లర్ చేయనున్నారని తెలుస్తోంది.