English | Telugu

ఇవన్నీ చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు - విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ ట్వీట్‌

ఐదు సంవత్సరాల విజయ్‌ దేవరకొండ నిరీక్షణ ఫలించింది. ‘ఖుషి’ విజయంతో మళ్ళీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. గీతగోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్‌ చేసిన సినిమాలన్నీ పరాజయాన్ని చవిచూశాయి. ఈరోజు విడుదలైన ‘ఖుషి’పై అతని హోప్స్‌ పెట్టుకున్నాడు. ఈ సినిమా అతని నమ్మకాన్ని నిలబెట్టింది. సినిమా చాలా బాగుంది అని కొందరు, ఫర్వాలేదు అని కొందరు, ఒకసారి చూడొచ్చు అనే వారు కొందరు. అయితే ఓవరాల్‌గా సినిమాకి పాజిటివ్‌ టాకే వచ్చింది. చాలా కాలం తర్వాత హిట్‌ అనే మాట విన్న విజయ్‌ ఒక ఎమోషనల్‌ ట్వీట్‌తో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
‘‘నన్ను అభిమానించే వారంతా నా సినిమా విజయం సాధించాలని 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. ఒక మంచి సినిమాతో మళ్ళీ సక్సెస్‌లోకి వస్తానని ఆశించారు. ‘ఖుషి’తో వారిలో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ సినిమా విజయంతో నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా నన్ను నిద్ర లేపారు. కొన్ని వందల మెసేజ్‌లతో నా ఫోన్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. వరసగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. మీరందరూ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడండి. మీరంతా ‘ఖుషి’ చిత్రాన్ని ఆదరిస్తారని నాకు తెలుసు. లవ్‌ యూ ఆల్‌’’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.