English | Telugu
‘సలార్’ రిలీజ్ వాయిదా.. ఈ విషయంలో నిజమెంత?
Updated : Sep 1, 2023
టాప్ హీరోల సినిమాలు చాలా సందర్భాల్లో రిలీజ్ వాయిదా పడడం అనేది సర్వసాధారణం. చాలా మంది హీరోలకు ఆ అనుభవం ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం రిలీజ్ వాయిదా పడబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ మోకాలికి ఇటీవలే ఆపరేషన్ జరిగింది. అది కారణం కావచ్చు అంటున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ఔట్‌పుట్ విషయంలో సంతృప్తికరంగా లేడని, అందుకే మరికొంత టైమ్ తీసుకొని పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాని సెప్టెంబర్ 28న కాకుండా డిసెంబర్‌లో ఒక మంచి డేట్ చూసి రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారని సమాచారం. ఈ వెర్షన్ ఇలా ఉంటే.. మరో వెర్షన్‌లో సెప్టెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు, ఓవర్సీస్ బుకింగ్స్‌కి అంతా సిద్ధమైంది. కాబట్టి రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదని, ఎవరో కావాలనే ఈ రూమర్‌ని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ‘సలార్’ వాయిదాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు కాబట్టి యదాతథంగా సెప్టెంబర్ 28నే సినిమా రిలీజ్ అవుతుందేమో!