English | Telugu
నేను ఉపేంద్రను.. సీఎం కావాలనుకుంటున్నాను.. గెలిపిస్తారా?
Updated : May 24, 2021
"నేను ఉపేంద్రను. ఈ రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటున్నాను. నేను ఎన్నికల్లో నిల్చున్నట్లయితే మీరు నన్ను గెలిపిస్తారా?" అని ప్రజలను అడిగారు కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర. అభిమానులు 'ఉప్పి'గా పిలుచుకొనే ఈ బహుభాషా నటునికి సీఎం కావాలనే, అందులోనూ పర్మినెంట్ సీఎం కావాలనే కోరిక కలిగింది. అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తన కోరికను వ్యక్తం చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
"చూడండి.. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. నేను రైతుల దగ్గర్నుంచి నేరుగా కొని, వాటిని అవసరమైన పేదలకు పంపిణీ చేస్తున్నాను. ఎన్నికల సమయంలో నేను తీవ్రంగా పోరాడుతున్నాను. రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నాను. నన్ను ఎన్నుకోమని అడుగుతున్నాను. మీ మంచి భవిష్యత్తు కోసం నేను పనిచేస్తాను. కర్నాటకను గొప్ప రాష్ట్రంగా మార్చేందుకు రేయింబవళ్లు శ్రమిస్తాను. నన్ను ఎన్నుకోగలరా?" అని ఆయన అడిగారు.
"మీరు నన్ను ఎన్నుకుంటారో, లేదో నాకు తెలీకపోతే నేను ఎన్నికల్లో పోటీచేయను. అలాంటప్పుడు 'ఉత్తమ ప్రజాకీయ పార్టీ' ఎందుకని మీరు అడగవచ్చు. భవిష్యత్తులో ఫేమ్ ద్వారా లీడర్లయ్యే వారిని రాజకీయాలు ఇస్తాయి. ప్రజాకీయ లీడర్లను తయారుచెయ్యదు. ఇక్కడ జనం కామన్ పీపుల్. వారు ఫేమస్ అవ్వాల్సిన పనిలేదు. వారు ఎన్నికల్లో నిలబడతారు. మీరు వారిని ఎన్నుకున్నట్లయితే, మీకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగం ఇచ్చినట్టయితే, మీరు కోరుకున్న పని వారు చేస్తారు. పూర్తి పారదర్శకంగా ప్రతి పైసాకు మీకు లెక్కచెబుతారు.
ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని వారు ఫాలో కాకపోతే, వారి పనితీరు మీకు నచ్చకపోతే, మరో పార్టీలో వారు చేరాలనుకుంటే, మీ సీఎంగా నేను మీతో ఉంటా. ఆ వ్యక్తిని తొలగించేదాకా మీతో కలిసి నేను పోరాడుతా. చట్టంలో ఆ ప్రతినిధిని రీకాల్ చేసే ప్రొవిజన్ ఉండాలి. అలాంటి పవర్ కోసం మీతో నేను పర్మినెంట్‌గా ఉంటాను. ఒక పర్మినెంట్ సీఎం (కామన్ మ్యాన్)గా...
కాదు, కాదు.. మీ అసాధారణ సామాన్య ప్రజలందరిలో నేనూ ఒకడిగా ఉంటాను. సరేనా?" అని ఆయన ఆ లెటర్‌లో రాసుకొచ్చారు. అదీ విషయం.. సీఎం.. అంటే చీఫ్ మినిస్టర్ కాదన్న మాట.. కామన్ మ్యాన్ అన్నమాట!