English | Telugu
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. దీవావస్థలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్!
Updated : Jan 3, 2024
సౌత్‌లో 10 సంవత్సరాలకు పైగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన మణిశర్మ ఇప్పుడు సినిమా ఛాన్సులు లేక అల్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలకు సూపర్‌హిట్ పాటలు అందించిన మణిశర్మ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా బాగా వెనకబడిపోయాడు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరికీ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మను ఇప్పుడు అందరూ పక్కన పెడుతున్నారు. న్యూ టాలెంట్‌ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా అవకాశాల్లేక చిన్న హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు మణిశర్మ. తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో తనకు కొంత బాధ ఉందని, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఛాన్స్ వచ్చేలా సినిమాలు చేస్తే బాగుంటుందని అంటున్నాడు.
వాస్తవానికి మణిశర్మ మ్యూజిక్ చేసిన సినిమాల్లో సూపర్‌హిట్ అయిన పాటల శాతం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మ్యూజిక్ విషయంలో జనం టేస్ట్ మారుతోంది. కాలానుగుణంగా సంగీతాన్ని అందించేలా మణిశర్మ తనను తాను ట్యూన్ చేసుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. తెలుగులో తమన్, దేవిశ్రీప్రసాద్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లే కాకుండా ఇతర భాషల నుంచి కూడా మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకుంటున్నారు. ట్రెండ్‌కి తగ్గట్టు మ్యూజిక్ చేసే వారికే హీరోలు, దర్శకనిర్మాతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ పాటలు చేసి ఉండొచ్చు. ఇప్పటి జనరేషన్‌కి కూడా నచ్చే విధంగా పాటలు చేస్తే తప్పకుండా మణిశర్మకు కూడా అవకాశాలు వస్తాయి. ఆమధ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు మణిశర్మ. అయినప్పటికీ అతనికి పెద్ద హీరోలెవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. ఎంత టాలెంట్ ఉన్నా, సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన చరిత్ర ఉన్నా ఇళయరాజా వంటి మ్యూజిక్ డైరెక్టర్సే ప్రస్తుతం కనుమరుగైపోయారు. కాబట్టి ఈ విషయంలో స్టార్ హీరోలను కూడా తప్పుబట్టే అవకాశం లేదు.