English | Telugu

వామ్మో.. ఫ్లాపులు వెంటాడుతున్నాయ్‌!




బాహుబ‌లి చూసి భుజాలెగ‌రేసింది టాలీవుడ్‌. నిజ‌మే.. ఆ సినిమా ఏకంగా రూ.500 కోట్ల‌కుపైనే వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. బాలీవుడ్ సినిమాల్ని సైతం ఒణికించింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన శ్రీ‌మంతుడు అంత కాక‌పోయినా.. వంద కోట్ల మార్కు దాటి త‌న స‌త్తా చాటింది. సినిమా బాగుంటే.. భారీ వ‌సూళ్లు సాధించ‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌ని ఈ రెండు సినిమాలూ నిరూపించాయి. దాంతో టాలీవుడ్‌కి మంచి రోజులొచ్చాయ‌ని, వంద కోట్ల సినిమాల్ని మ‌రిన్ని చూసే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఊహించారంతా. అయితే ఆ త‌ర‌వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫట్ ఫ‌ట్ మంటూ పేలిపోయాయి.

మరీ ముఖ్యంగా కిక్ 2, శివ‌మ్, బ్రూస్లీ, షేర్‌, అఖిల్ సినిమాలు దారుణ ప‌రాజ‌యాల్ని మూట‌గ‌ట్టుకొన్నాయి. రుద్ర‌మ‌దేవి ఓకే అనిపించుకొన్నా... ఈ సినిమా వ‌ల్ల గుణ‌శేఖ‌ర్‌కి దాదాపుగా రూ.20 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. టాలీవుడ్‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని సంబ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఈ ఫ్లాపులు మ‌ళ్లీ నిరాశ‌లో ముంచేశాయి. శ్రీ‌మంతుడు త‌ర‌వాత వ‌చ్చిన సినిమాల వ‌ల్ల టాలీవుడ్‌కి దాదాపుగా రూ.300 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని ఓ అంచ‌నా. బ‌య్య‌ర్లు తీవ్ర స్థాయిలో న‌ష్ట‌పోయారు. కొంత‌మంది నిర్మాత‌ల్ని ఆశ్ర‌యించి న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల్సిందిగా కోరుకొన్నారు.

ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన చిన్న సినిమాలు కూడా నిరాశ ప‌రిచాయి. ఏవో కొన్ని హిట్లు వ‌చ్చినంత మాత్రాన‌, వ‌సూళ్లు గుమ్మ‌రించుకొన్నంత మాత్రాన అన్ని సినిమాలూ.. హిట్లు కావని, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో సినిమాలు తీస్తే.. వాత‌లు పెట్టుకోక త‌ప్ప‌ద‌ని ఈ సినిమాలు నిరూపించాయి. ఇప్ప‌టికైనా.. క‌థ‌పై దృష్టి పెట్టి, ప్రేక్ష‌కుల‌కు కొత్త త‌ర‌హా వినోదాన్ని అందించ‌డంవైపు దృష్టి పెడితే మంచిది. 2015 చివ‌ర్లో సైతం కొన్ని భారీ సినిమాలు రాబోతున్నాయి. క‌నీసం అవైనా ప్ర‌జాద‌ర‌ణ పొందితే.. టాలీవుడ్‌కి కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కొచ్చు.