Read more!

English | Telugu

మన హాస్యహీరోలు వీళ్లే..!!

ఈ శుక్రవారం సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి రిలీజ్ కాబోతోంది. చాలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు జాబితాలో సునీల్ కూడా ఉంటాడు. చిన్న పాత్రల స్థాయినుంచి టాలెంట్ తో, స్టార్ కమెడియన్ గా అటునుంచి హీరోగా సునీల్ ప్రస్థానం సాగింది. సునీల్ లా కమెడియన్ గా మొదలు పెట్టి హీరోగా చేసిన వాళ్లు బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి వరకూ ఎంతో మందే ఉన్నారు. కానీ అతనిలా, హీరో కాంపిటీషన్ ను తట్టుకుని ఎవరూ ప్రోలాంగ్ చేయలేదు. ఒకసారి మన హాస్యవీరులు ఎవరెవరు హీరోలుగా చేశారో ఓ లుక్కేద్దామా..చలో..



రేలంగి


తొలితరం హాస్యనటుల్లో ఒకరైన రేలంగి మనకు హాస్యనటుడిగానే తెలుసు. కానీ ఆయన హీరోగా కూడా ఓ సినిమా చేశారు.. పక్కింటి అమ్మాయి పేరుతో 1953లో వచ్చిన ఆ సినిమాలో రేలంగి సరసన అంజలీ దేవి నటించారు. ఈ ఒక్క సినిమాకు మాత్రమే రేలంగి హీరోగా చేశారు. తర్వాత ఎవరూ అడగలేదు. ఆయన కూడా ప్రయత్నించలేదు. కానీ రేలంగికి హీరోకు దక్కినంత గౌరవమే దక్కేది. ఆయనకు సినిమాలో సెపరేట్ కామెడీ ట్రాక్, సాంగ్ తప్పనిసరిగా పెట్టేవారు డైరెక్టర్లు. ఆయన స్వయంగా పాడే ఆ సాంగ్ కోసమే చాలా మంది ప్రేక్షకులు సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు.



రాజబాబు


చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోని పేరు రాజబాబు. తెలుగువారికి కితకితలు పెట్టి, తన కోసమే ప్రేక్షకుల్ని హాల్ కు రప్పించుకున్న హాస్యనటుల్లో ఆయన కూడా ఒకరు. తాత మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాల్లో హీరోగా నటించారు రాజబాబు. హీరోగా సక్సెస్ ను కూడా చూసినా, ఆయన హాస్యాన్ని వదిలి బయటికి రాలేదు.



పద్మనాభం


హీరోగా,డైరెక్టర్ గా, నిర్మాతగా, సింగర్ గా చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మనాభం. తనకు సొంత ప్రొడక్షన్ ఉన్నా, డైరెక్షన్ చేసినా హీరోగా కంటిన్యూ అవ్వాలని ఎప్పుడూ ఆయన అనుకోలేదు. ఆయన హీరోగా చేసిన సినిమాల్లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ఒక మచ్చు తునక.



బ్రహ్మానందం


పూర్తి స్థాయి హీరోగా సినిమా చేయకపోయినా, లీడ్ రోల్ తో చాలా సినిమాలే చేశాడు బ్రహ్మీ. అన్నింటిలోకీ ఆయనకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది ఖాన్ దాదా పాత్ర. నిన్న మొన్నటి వరకూ కూడా కమెడియన్ గానే చేస్తున్నా, పెద్ద హీరోల సినిమాల్ని కూడా తన కామెడీతో ఒడ్డుకు లాక్కొచ్చి హిట్ చేసిన సినిమాలు బోలెడు..ఏవీయస్ తో కలిసి, సూపర్ హీరోస్ సినిమాలో మాత్రం కాస్త మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్లో నటించాడు బ్రహ్మి



అలీ


కమెడియన్స్ అందరిలోకీ, హీరోగా ఎక్కువ ఫ్యామస్ అయ్యాడు అలీ. ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్లో అలీ చేసి యమలీల, అప్పట్లో 150 డేస్ పైగానే ఆడింది. ఆ తర్వాత కూడా పిట్టలదొర, సర్కస్ సత్తిపండు లాంటి సినిమాలు చేసినా, అవకాశాలు తగ్గడంతో కమెడియన్ గానే స్థిరపడిపోయాడు.

శ్రీనివాసరెడ్డి
 

తన టాలెంట్ ను చూపించే అవకాశాలు పెద్దగా రానప్పటికీ, హీరో పాత్రల్ని కూడా దక్కించుకోగలుగుతున్నాడు శ్రీనివాసరెడ్డి. గీతాంజలిలో హీరోగా ఛాన్స్ వచ్చిన తర్వాత, మధ్యలో హాస్యనటుడిగా కంటిన్యూ అయిన శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు హీరోగా జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమా చేస్తున్నాడు.

ఇక సునీల్ సంగతి తెలిసిందే. కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చాడు. కానీ సునీల్ ను పూర్తి స్థాయి హీరోగా ఎందుకో తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోలేకపోతున్నారు. బహుశా సునీల్ కామెడీ మిస్ అవడం వల్ల కావచ్చు. మరి కృష్ణాష్టమితో అయినా, సునీల్ ను పూర్తి స్థాయి మాస్ హీరోగా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్నది చూడాలి..