English | Telugu

తన పుట్టినరోజున పదవీ బాధ్యతలు చేపట్టిన దిల్‌రాజు!

దాదాపు పాతిక సంవత్సరాలుగా సినిమా రంగంలోని వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక పదవిని అప్పగించిన విషయం తెలిసిందే. పంపిణీదారుడుగా, నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా కొనసాగుతున్న దిల్‌రాజు అలియాస్‌ వి.వెంకటరమణారెడ్డిని తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కి అధ్యక్షుడిగా నియమించింది తెలంగాణ సర్కార్‌. పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు కొంత సమయం ఇచ్చింది ప్రభుత్వం. డిసెంబర్‌ 18 దిల్‌రాజు పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నుంచి రెండు సంవత్సరాలపాటు దిల్‌ రాజు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దిల్‌రాజుకు అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

దిల్‌ రాజు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు పి.భరత్‌భూషణ్‌, గౌరవ కార్యదర్శులు కె.యల్‌. దామోదర్‌ప్రసాద్‌, కె.శివప్రసాదరావు.