English | Telugu

బిగ్‌బాస్‌ బ్యూటీకి సుప్రీం కోర్టు షాక్‌.. హీరోయిన్‌ సంజనకు నోటీసులు!

2005లో తరుణ్‌ హీరోగా వచ్చిన ‘సోగ్గాడు’ చిత్రంలో ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు సంజన గల్రాని. ఆ తర్వాత కన్నడ, తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌9 తెలుగు షోలో కంటెస్టెంట్‌గా ఉంది. అంతకుముందు బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌ 1లో కూడా కంటెస్ట్‌ చేసింది. అయితే 14వ రోజునే ఎలిమినేట్‌ అయిపోయింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌9లో మొదటి వారం తన ఆట తీరుతో హౌస్‌మేట్స్‌కి చుక్కలు చూపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా సంజనకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసి షాక్‌ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది.

వివరాల్లోకి వెళితే.. 2020లో డ్రగ్స్‌ రాకెట్‌ను నడుపుతోందనే ఆరోపణతో ఆమెను అరెస్ట్‌ చేసింది సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌. డ్రగ్స్‌ వినియోగించడమే కాకుండా కన్నడ పరిశ్రమలోని కొందరికి డ్రగ్స్‌ సరఫరా చేసిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకి పంపించారు. ఈమె కంటే ముందు రాగిణి ద్వివేదిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సంజనను 14వ నిందితురాలిగా చేర్చారు. మూడు నెలలపాటు ఆమె జైలు జీవితం గడిపింది. పలు మార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ కోర్టు దాన్ని రిజెక్ట్‌ చేసింది. 2024 మార్చి 25న ఈ కేసును కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం సెక్షన్‌ 219 సీఆర్పీసీ ప్రకారం 12 నెలల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ నేరాలపై ఒకే ట్రయల్‌ జరపలేమని పేర్కొంది. దీంతో సంజనకు ఊరట లభించింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ కారణంగానే తాజాగా సంజనకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ న్యాయవాది ఈ కేసు గురించి మాట్లాడుతూ మాదకద్రవ్యాలను సేకరించేందుకు నైజీరియన్‌ డ్రగ్‌ డీలర్స్‌తో సంజన మాట్లాడినట్టు కాల్‌ రికార్డ్స్‌ ఉన్నాయని తెలిపారు. ఫోరెన్సిక్‌ ఫోన్స్‌ అంచనాలలోనూ ఈ విషయం నిర్థారణ అయిందన్నారు. అత్యధికంగా డబ్బు సంపాదించేందుకు ఎంతో మంది వ్యక్తులకు డ్రగ్స్‌ విక్రయించిందని, ఈ విషయంపై చాలా మంది సాక్షమిచ్చారని ధర్మాసనం ముందు వాదించారు ప్రభుత్వ న్యాయవాది.

బహిరంగ ప్రదేశాల్లో సంజన డ్రగ్స్‌ సరఫరా చేసిందని, తమకు ఇబ్బంది కలిగించిందని ఇరుగుపొరుగువారు కూడా చెప్పారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రగ్స్‌ ఎవరెవరికి విక్రయించారో వివరాలు చెప్పాలని బెంగళూరు పోలీసులు కోరినప్పటికీ ఆ వివరాలు ఆమె చెప్పలేదని తెలుస్తోంది. తాజాగా జారీ చేసిన నోటీసుల వల్ల సంజన మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.