English | Telugu

తలైవా అభిమానులకు శుభవార్త.. ఆస్పత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌!

నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. నాలుగు రోజలు చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈరోజు ఉదయం తన నివాసానికి చేరుకున్నారు రజినీ. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్‌ అమర్చారు. ట్రాన్స్కాథెటర్‌ పద్ధతి ద్వారా తలైవాకు స్టెంట్‌ వేసినట్టు అపోలో వైద్యులు తెలిపారు.

తమ హీరో ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారని తెలుసుకున్న సూపర్‌స్టార్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చేవారం రజినీ కొత్త సినిమా ‘వేట్టయాన్‌’ రిలీజ్‌ కాబోతోంది. ఈ సమయంలో సూపర్‌స్టార్‌ అనారోగ్యానికి గురి కావడం అభిమానుల్ని బాధించింది. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రజినీ ఆస్పత్రిలో ఉన్నారని తెలిసి వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో రజినీకాంత్‌ సతీమణి లత మీడియా ముందుకు వచ్చి రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందనే శుభవార్తను అభిమానులకు చెప్పారు. ఇక వచ్చే వారం దసరా కానుకగా రిలీజ్‌ కానున్న తలైవా కొత్త సినిమా సంబరానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.