English | Telugu
విలన్ గా సుధీర్ బాబు బాగున్నాడండోయ్
Updated : Mar 15, 2016
బాహుబలి ప్రభాస్ కెరీర్లోనే మర్చిపోలేని సూపర్ హిట్ వర్షం. దీన్ని హిందీలో బాఘీ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లు గా నటించారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు ఒక డౌట్ రాక మానదు. ఇది తెలుగు వర్షం సినిమానేనా అని. కేవలం సినిమాలోని బేసిక్ లైన్స్ ను తీసుకుని, మిగిలిన సెటప్ అంతా బాలీవుడ్ కు తగ్గట్టు మార్చారు. ఇంకా చెప్పాలంటే, చైనా సినిమా రేంజ్ లో మార్చేశారు. ఆ మార్షల్ ఆర్ట్స్, బిల్డింగ్ నిండా రౌడీలు గట్రా చూస్తే, ఇదేదో బ్రూస్ లీ సినిమాలా ఉందే అనిపించక మానదు.
ఇందులో విలన్ గా మన తెలుగు హీరో సుథీర్ బాబును తీసుకున్నారు. బాఘీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో పాటు, సుధీర్ బాబు తన శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. " ఎక్కడో బాలీవుడ్ లోని ఒక ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుకుతూ ఒక తెలుగోడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు " అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్ చూసిన వాళ్లు కూడా హీరో కంటే విలనే బాగున్నాడంటూ ప్రశంసలు కురిపించడం విశేషం. కానీ వర్షం అనేది ఒక ఫీల్ గుడ్ గా అనిపించే ప్రేమకథ. బాఘీ ట్రైలర్లో మాత్రం అలాంటి సూచనలేమీ కనబడలేదు. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.