English | Telugu

బిగ్‌ అప్‌డేట్‌... SSMB29 కోసం కెన్యా అడవుల్లో ఏం చెయ్యబోతున్నారో తెలుసా?

బిగ్‌ అప్‌డేట్‌... SSMB29 కోసం కెన్యా అడవుల్లో ఏం చెయ్యబోతున్నారో తెలుసా?

గతంలో రాజమౌళి సినిమా స్టార్ట్‌ అయ్యిందంటే చాలు.. దానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూనే ఉండేవారు. యూనిట్‌ ఇవ్వకపోయినా సోషల్‌ మీడియాలో రకరకాల ఊహాగానాలు చేసేవారు. కానీ, SSMB29కి సంబంధించి అంతా రివర్స్‌లో జరుగుతోంది. సైలెంట్‌గా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. ఇంతకుముందు ఏ సినిమానీ పూర్తి చేయనంత స్పీడ్‌గా రాజమౌళి ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. దానికి కారణం ఏమిటి అనేది తెలియలేదు. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. త్వరలోనే యూనిట్‌ సభ్యులంతా కెన్యాకి పయనమవుతున్నారు. కెన్యాలో భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. 

ఇప్పటికే హైదరాబాద్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మహేష్‌, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ పాల్గొన్న ఈ సీన్స్‌ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశారు. అయితే ఈ షెడ్యూల్‌లో మహేష్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సాధారణంగా ప్రతి సీన్‌ని చెక్కుతూ వెళ్లే రాజమౌళి ఈ సినిమా విషయంలో ఆ పరిస్థితి రాకుండా ముందే ప్లాన్‌ చేసుకున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. 

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్‌ కోసం అంతా రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి చేయని కొత్త బ్యాక్‌డ్రాప్‌లో మహేష్‌ సినిమా ఉండబోతోంది. కథ ప్రకారం సినిమాలోని చాలా భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది. అంత దట్టమైన అడవులు ఆఫ్రికాలో ఉంటాయి. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచీ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, సౌతాఫ్రికాలోనే దానికి సంబంధించిన షూటింగ్‌ చేస్తామని యూనిట్‌ చెబుతూనే వస్తోంది. దానికోసమే రాజమౌళి సౌతాఫ్రికా వెళ్ళి అక్కడ తమ సినిమాకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను సెలెక్ట్‌ చేసుకొని వచ్చారు. దాని కోసం అక్కడ కొన్ని రోజులపాటు స్టే చేశారు రాజమౌళి. ఇదంతా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే జరిగింది. జూలైలో కెన్యా షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుందని తెలుస్తోంది. అక్కడ షూటింగ్‌ చేయడానికి కావాల్సిన అనుమతుల్ని కెన్యా ప్రభుత్వం ఇప్పటికే గ్రాంట్‌ చేసింది. దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో తీస్తారు. ఇందులో మహేష్‌, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌ పూర్తయితే SSMB29కి సంబంధించి ఒక పిక్చర్‌ వచ్చే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు.