Read more!

English | Telugu

స్పీడున్నోడు రివ్యూ

రీమేక్ సినిమా అన‌గానే.. ఆశ‌గా చూసేస్తుంటారు హీరోలు, ద‌ర్శ‌కులు. ప్రేక్ష‌కుల‌దీ అదే ఫీలింగ్. ప‌క్క భాష‌లో బ్ర‌హ్మాండంగా ఆడేసింద‌ట‌.. ఇక ఇక్క‌డా ఇర‌గ‌దీయ‌డం ఖాయం అని లెక్క‌లు వేసుకొంటారు?  తీరా క‌థ చూశాక‌... ఓస్ ఈ మాత్రం దానికే రీమేక్ చేయాలా?  అంటూ నీర‌సంగా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో రీమేక్ అయిన స‌వాల‌క్ష సినిమాల‌ది ఇదే స్టోరీ. మ‌రి స్పీడున్నోడు మాటేంటి?  త‌మిళ, క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ట‌యిన సుంద‌ర పాండ్య‌న్‌కి ఇది రీమేక్‌. మ‌రి రీమేక్ మేక్‌లా మారిందా?  మైసూర్ పాక్‌లా తీయ‌గా ఉందా?  తేలాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే. 

కథ:

వెంక‌టాపురంలో జ‌రిగే క‌థ ఇది. అక్క‌డ ఆడ పిల్ల పుడితే.. గొప్ప గౌర‌వం. మ‌గ‌వాళ్ల‌తో స‌మానం గా పెంచుతారు. పెద్ద చ‌దువులు చ‌దివిస్తారు. కానీ... ఆడ‌పిల్ల‌ల వెంట ఎవ‌రైనా ప్రేమా గీమా అని ప‌డ్డారంటే.. వాళ్ల అంతు చూస్తారు. ప‌క్క ఊరు రాప్తాడు కుర్రాడు శోభ‌న్ (బెల్లంకొండ శ్రీ‌నివాస్‌). త‌న‌కు స్నేహితులంటే ప్రాణం. వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. శోభ‌న్ స్నేహితుడు గిరి (మ‌ధునంద‌న్‌) వెంక‌టాపురం అమ్మాయి వాసంతి (సోనారిక‌)ని ప్రేమిస్తాడు. స్నేహితుడి ప్రేమ‌ని గెలిపించ‌డం కోసం.. గిరికి ప్రేమ సూత్రాలు బోధిస్తాడు. వాసంతి ప్ర‌యాణించే బ‌స్సులోనే తాను వెళ్తుంటాడు. ఈలోగా చిట్టి (స‌త్య‌) అనే మ‌రో క్యారెక్ట‌ర్ సీన్‌లోకి వ‌స్తుంది. తానూ  వాసంతినే ప్రేమిస్తాడు. కానీ వాసంతి మాత్రం శోభ‌న్ అంటే ఇష్టం చూపిస్తుంటుంది. చివ‌రికి శోభ‌న్ కూడా వాసంతి ప్రేమ‌లో ప‌డిపోతాడు. దాంతో చిట్టి క‌క్ష పెంచుకొంటాడు. అక్క‌డి నుంచి శోభ‌న్‌కి స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. వాటి నుంచి శోభ‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

 

 

ఎనాలసిస్ :

ప్రాణంలా భావించిన స్నేహితులే న‌మ్మ‌క ద్రోహం చేస్తే ?  అనే పాయింటు చుట్టూ న‌డిచే క‌థ ఇది. బేసిగ్గా ఇలాంటి క‌థ‌లు చాలాసార్లు చూసేశాం. కానీ సుంద‌ర పాండ్య‌న్‌లోని గొప్ప‌ద‌నం ఏంటంటే.. మ‌న‌సుని హ‌త్తుకొని హాంట్ చేసే క్లైమాక్స్‌. స్టోరీ లైన్‌నీ క్లైమాక్స్‌నీ న‌మ్ముకొని.. భీమినేని రంగంలోకి దిగిపోయాడు. అయితే త‌మిళంలో ఉన్న‌ది ఉన్న‌ట్టు తెలుగులో తీస్తే.. ఇక్క‌డ ఆర్ట్ ఫిల్మ్ అనే ముద్ర ప‌డిపోతుంది. దాంతో.. క‌మ‌ర్షియ‌ల్ హంగులు, త‌న‌వైన తెలివితేట‌లు జోడించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే... ఆ ప్ర‌య‌త్నం ఫెయిల్ అయ్యింది. క‌మ‌ర్షియ‌ల్ కోటింగు ఎక్కువై... సినిమాలోని ఫీల్ తగ్గింది. కామెడీ, యాక్ష‌న్‌, హీరోయిజం.. వీటి మ‌ధ్య సుంద‌ర పాండ్య‌న్‌లోని ఫీల్ గాల్లోకి ఎగిరిపోయింది. సినిమా తొలి అర్థ భాగం కామెడీని న‌మ్ముకొని లాగించేశాడు ద‌ర్శ‌కుడు. ఇంట్రవెల్ ట్విస్ట్ సైతం ఆస‌క్తిగా ఉండ‌దు. సెకండాఫ్‌లో మాత్రం క‌థ చెప్పాల్సివ‌చ్చింది. అక్క‌డ ఎమోష‌న్ ని జోడించాల్సిన చోట‌.. భీమినేని పూర్తిగా ప‌ట్టుత‌ప్పాడు. దాంతో సుంద‌ర‌పాండ్య‌న్‌లో ఏదైతే బ‌లం అయ్యిందో.. అదే ఇక్క‌డ బ‌ల‌హీనంగా మారింది. ప‌తాక స‌న్నివేశాలు ఓకే అనిపించినా.. హార్ట్ ట‌చింగ్ గా మాత్రం లేవు. ద‌ర్శ‌కుడు న‌మ్ముకొన్న కామెడీ, శ్రీ‌నివాస్ డాన్సులు, త‌మ‌న్నా ఐటెమ్ సాంగ్‌.. క్లైమాక్స్ మిన‌హాయించి చూస్తే. స్పీడున్నోడు లో మేట‌ర్ లేన‌ట్టు క‌నిపిస్తుంది. ఆహా అనుకొనే సుంద‌ర పాండ్య‌న్‌కి ఓకే అనే స్థాయిలో చూపించ‌డంలో మాత్రం.. భీమినేని స‌క్సెస్ అయ్యాడంతే.

 

 

 

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఈత‌రం హీరోలంతా డాన్సులు, ఫైటింగుల మీదే దృష్టి పెడుతున్నారు. శ్రీ‌నివాస్ కూడా అంతే. ఆ రెండు విభాగాల్లో త‌న జోరు తొలి సినిమాలోనే చూసేశాం. రెండో సినిమాలోనూ అదే చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. డాన్సులు బాగా చేశాడు. ఫైట్స్ కూడా ఓకే. అయితే ఎమోష‌న్ డైలాగ్స్ ప‌లికేట‌ప్పుడు ఇంకా జాగ్ర‌త్త‌గాఉండాలి.. ఇంకాస్త క‌స‌ర‌త్తు చేయాలి. సోనారిక స‌న్నివేశాల్లో ప‌ద్ధతిగా క‌నిపించి, పాట్ల‌లో రెచ్చిపోయింది. ప్ర‌కాష్ రాజ్ రెండు మూడు సీన్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. రావు ర‌మేష్ ఓకే. శ్రీ‌నివాస‌రెడ్డి, 30 ఇయ‌ర్స్ ఫృద్వీ కాసేపు న‌వ్వించారు. స్నేహితుల గ్యాంగ్ అంతా ఓకే! ఝాన్సీ మ‌రోసారి ఓవ‌ర్ యాక్ష‌న్ చేసింది.

సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. ప్ర‌తీ సీన్ క‌ల‌ర్‌ఫుల్‌గా తీశాడు. వ‌సంత్ పాట‌లు శ్రీ‌నివాస్ డాన్స‌లు చేయ‌డానికే అన్న‌ట్టు సాగాయి. ద్వితీయార్థం స్లో అవ్వ‌డం ద‌ర్శ‌కుడి త‌ప్పిద‌మే. తొలి అర్థ‌భాగంలోనే 5 పాట‌లు పెట్టేశారు. సంద‌ర్భ‌శుద్ది లేకుండా వ‌చ్చే పాట‌ల‌తో సినిమా స్పీడు త‌గ్గింది. ఓవ‌రాల్‌గా రీమేక్ సినిమా చేస్తున్న‌ప్పుడు ఏ ద‌ర్శ‌కుడైనా చేసే త‌ప్పులే.. భీమినేని చేసేశాడు. రీమేక్ స్పెష‌లిస్టుగా ముద్ర ఉన్న భీమినేనే అన్ని త‌ప్పులు చేస్తే.. ఎలామ‌రి?!  సుంద‌ర పాండ్య‌న్‌లో ఉన్న ఫీల్ తీసేసి, దానికి కొన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు క‌లిపితే... అదే స్పీడున్నోడు.

రేటింగ్‌: 2.25