Read more!

English | Telugu

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలకు ఎసరు పెట్టిన సింగర్

కొద్ది రోజుల క్రితం, సోనూ నిగమ్ విమానంలో ప్రయాణిస్తూ, ప్రయాణికుల కోరిక మేరకు అనౌన్సింగ్ మైక్ లో పాట పాడారు. ప్రయాణికులు కూడా, ఆయనతో స్వరం కలిపి పాట పాడారు. ఈ వీడియో నెట్ లో సూపర్ హిట్ అయింది. ఆయన అభిమానులు ఆ వీడియోను బాగా ఎంజాయ్ చేయడమే కాక మా సోనూ ఎంత మంచోడో అని మురిసిపోయారు. ఇక్కడ వరకూ కథ ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఆ తర్వాతే, విమానంలోని సిబ్బందికి కొత్త ట్విస్ట్ లు మొదలయ్యాయి.

ప్రయాణికులను అడ్రస్ చేయడం కోసం వాళ్లు ఉపయోగించాల్సిన మైక్ ను, ఒక ప్రయాణికుడు ఉపయోగించడం, దానికి వాళ్లు అడ్డు చెప్పకపోవడాన్ని జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించని కారణంగా, ఆ విమానంలో డ్యూటీల్లో ఉన్న ఐదుగురు ఎయిర్ హోస్టస్ లను ప్రస్తుతానికి సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంఘటనపై పూర్తి విచారణ జరిపించి, వారికి మరింత శిక్షణ ఇప్పిస్తామని అక్కడి ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారత్ లో అసలైన అసహనం అంటే ఇదే అంటూ దీనిపై సోనూ నిగమ్ స్పందించాడు. " ఆ సమయంలో ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. అనౌన్సింగ్ మైక్ తో ఎవరికీ పని లేని సమయలోనే ప్రయాణికుల కోరిక మేరకు నేను పాట పాడాను. ఈ సంఘటనలో ఎవరూ తప్పు చేయలేదు" అని సోనూ స్పష్టం చేశాడు. మరి జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం సోనూ మాటల్ని పరిగణించి, సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారో లేదో చూడాలి.