English | Telugu

శోభన్ బాబు మనవడి గిన్నిస్ రికార్డు!

తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే నటులలో శోభన్ బాబు ఒకరు. సోగ్గాడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే శోభన్ బాబు వారసులు సినీ రంగానికి రాలేదు. అయినప్పటికీ వారు వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా సోగ్గాడి మనవడు సురక్షిత్ బత్తిన వైద్య రంగంలో గిన్నిస్ రికార్డు స్థాయికి ఎదిగారు.

చెన్నైలో తొలిసారిగా ట్రూ 3డి ల్యాపరోస్కోపిక్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత సురక్షిత్ సొంతం. ఎన్నో క్లిష్టమైన సర్జరీలను సురక్షిత్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవల తమిళనాడు చెందిన 44 ఏళ్ళ మహిళ గర్భాశయంలోని భారీ కణితిను 3డి ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించారు. భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తీసేశారు. గతంలో సురక్షిత్ గురువు రాకేష్ సిన్హా.. 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తన గురువు రికార్డుని సురక్షిత్ బద్దలుకొట్టడం విశేషం. త్వరలోనే గిన్నిస్ రికార్డుకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

సురక్షిత్ తన కెరీర్ లో పది వేలకు పైగా సర్జరీలు చేశారు. పదుల సంఖ్యలో అవార్డులు సాధించారు. ఇక ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకునే ఘనత సాధించడం అభినందించదగ్గ విషయం.