English | Telugu
సితార చేతికి 'లియో' తెలుగు రైట్స్!
Updated : Jul 19, 2023
'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' వంటి వరుస విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. 'ఖైదీ', 'విక్రమ్' తర్వాత ఆయన యూనివర్స్ లో భాగంగా దళపతి విజయ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'లియో'. ఈ చిత్రంపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరో అదరణపు ఆకర్షణ తోడైంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, 'లియో' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది. విజయ్ కెరీర్ లోనే మునుపెన్నడూ లేని విధంగా తెలుగులో భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.
'మాస్టర్' తర్వాత విజయ్, లోకేష్ కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. మరి పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్న సితారకు 'లియో' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.