(డిసెంబర్ 4 ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా..)
ఘంటసాల.. ఈ పేరు ఎంతో మంది సంగీత ప్రియుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆయన గానం మధురం, ఆయన సంగీతం మృదుమధురం. తన గానంతో ఆబాలగోపాలాన్నీ అలరించడమే కాకుండా, సినీ సంగీతంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన ఘనాపాటి ఘంటసాల. తెలుగు చిత్రసీమలో ఎంతో మంది గాయకులు తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకుల్ని పరవశింపజేశారు. అలాగే సంగీత దర్శకులు అద్భుతమైన పాటల్ని సృష్టించారు. ఘంటసాల విషయానికి వస్తే.. తను పాడిన పాటలతోనే కాకుండా, తన సంగీత దర్శకత్వంలో పదికాలాలపాటు సంగీత ప్రియులు పాడుకునే పాటల్ని రూపొందించారు. అయితే తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల తీరని అన్యాయం చేశారనే అభిప్రాయం కొందరు సంగీత ప్రియులలో ఉంది. అసలు సంగీతం అంటేనే ఘంటసాల. అలాంటిది సంగీతానికి ఆయన అన్యాయం ఎలా చేశారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం.
1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు ఘంటసాల వెంకటేశ్వరరావు. వీరి వంశ జన్మస్థలం కృష్ణా జిల్లాలోనే ఉన్న ఘంటసాల గ్రామం. నేటికీ వీరి వంశీకులు ఘంటసాల గ్రామంలో ఆలయ పూజారులుగా ఉన్నారు. ఘంటసాల తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. తండ్రితోపాటే ఆ భజనలకు వెళ్లేవారు ఘంటసాల. ఆయన 11 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఆయన చివరి మాటలు ఘంటసాలపై ఎంతో ప్రభావం చూపించాయి. ‘సంగీతం అనేది దైవ స్వరూపం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా నువ్వు గొప్ప సంగీత విద్వాంసుడివి కావాలి’ అని తన చివరి కోరికగా చెప్పారు సూర్యనారాయణ.
ఇక అప్పటి నుంచి సంగీతం నేర్చుకునేందుకు ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఘంటసాల. తనకు తెలిసిన సంగీత విద్యాంసుల ఇళ్లలో పనిచేసి రెండు సంవత్సరాలపాటు సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే అది సరైన పద్ధతి కాదని తెలుసుకున్న ఘంటసాల.. తన దగ్గర ఉన్న 40 రూపాయల విలువైన ఉంగరాన్ని 8 రూపాయలకు అమ్మేసి సంగీత కళాశాలలో చేరేందుకు విజయనగరం చేరుకున్నారు. అయితే ఆ సమయంలో కళాశాలకు సెలవులు కావడంతో ప్రిన్సిపాల్‌గా ఉన్న ద్వారం వెంకటస్వామినాయుడును కలుసుకున్నారు. అక్కడి స్టూడెంట్స్‌తో కలిసి ఒక రూమ్‌లో ఉండే ఏర్పాటు చేశారాయన. ఘంటసాల అక్కడ ఉంటూ వారాలు చేస్తూ గడిపేవారు.
ఒకసారి తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి.. ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆయన చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం చేయడం నేర్పించారు. భుజాన జోలె కట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవారు ఘంటసాల.
పట్రాయని శాస్త్రి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలోనే పూర్తిచేసారు ఘంటసాల. తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకొని తన సొంతవూరు అయిన చౌటపల్లికు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. అదే సమయంలో 1942లో స్వాతంత్య్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు.
1944 మార్చి 4న మేనకోడలు సావిత్రితో ఘంటసాల వివాహం జరిపించారు. ఆరోజు తన పెళ్లికి తానే కచ్చేరీ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఘంటసాల సంగీత కచ్చేరి చూసిన ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. అలా మద్రాస్ చేరుకున్న ఘంటసాలతో హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీలో ఒక పాట రికార్డ్ చేయించారు. అయితే సినిమా పాటలకు ఘంటసాల గాత్రం పనికిరాదని చెప్పడంతో అవకాశం దొరికే వరకు తన ఇంట్లో ఉండమని సముద్రాల చెప్పారు. ఆయన ఇల్లు చిన్నది కావడంతో వారికి ఇబ్బంది కలిగించకూడదని తన మకాంను పానగల్ పార్కుకు మార్చుకున్నారు. పగలంతా అవకాశాల కోసం తిరిగి రాత్రికి ఆ పార్కులోనే పడుకునేవారు. ఆ తర్వాత మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడిగా అవకాశం ఇప్పించారు సముద్రాల. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవారు ఘంటసాల. చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో ఘంటసాలకు మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. అదే సమయంలో బాలరాజు, చిత్రానికి గాలిపెంచల నరసింహారావుతో కలిసి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి సి.ఆర్.సుబ్బరామన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఆ తర్వాత కీలుగుర్రం చిత్రానికి పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు ఘంటసాల. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. వాటిలో మనదేశం, లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి, నిర్దోషి వంటి సినిమాలు ఉన్నాయి. 1951లో ఎన్టీఆర్ హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన పాతాళభైరవితో ఘంటసాల కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. నటరత్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతోనే మాస్ హీరోగా అవతరించారు. ఇక్క అక్కడి నుంచి ఘంటసాలకు వరస అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే నేపథ్యగాయకుడిగా కూడా ఘంటసాలకు మంచి పేరు వచ్చింది. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాలకు తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెప్పడం విశేషం.
1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీవెంకటేశ్వర మహత్మ్యం సినిమాలోని శేషశైలావాస శ్రీ వేంకటేశా పాటను తెరపైన కూడా ఘంటసాలే పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలరు అనే పేరు తెచ్చుకున్నారు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే. దాదాపు 25 సంవత్సరాలు కొనసాగిన ఆయన కెరీర్‌లో దాదాపు 10,000 పాటలు పాడారు. 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో యూరప్‌లో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపచేసారు. 1969 నుండి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారాయన. రెండు నెలల పాటు జరిగిన చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఘంటసాల హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే ‘భగవద్గీత’ను రికార్డ్ చేశారు. భగవద్గీత తర్వాత ఇక సినిమాల్లో పాడకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. ఆ తర్వాత తనకు తానే పాటలు తగ్గించుకున్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సినిమా పాటలు పాడారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా..’ పాటను ఘంటసాలతోనే పాడిరచుకోవాలని కృష్ణ పట్టు పట్టడంతో చేసేది లేక ఆ పాట పాడారు ఘంటసాల. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒక మధురగాయకుడు సంగీత ప్రియుల నుంచి సెలవు తీసుకున్నారు. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుది శ్వాస విడిచారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు నటుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టరే కాదు. నిర్మాత కూడా. తన అభిరుచి మేరకు మూడు సినిమాలు నిర్మించారు. అయితే ఇవేవీ ఆర్థికంగా విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే.. ఘంటసాలకు మొదటి నుంచీ సంగీత దర్శకుడు అవ్వాలని తన సంగీతంతో మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. పాటలు పాడాలని, సింగర్‌గా రాణించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, తన మధురమైన గానంతో గానగంధర్వుడుగా పేరు తెచ్చుకునే స్థాయి నేపథ్య గాయకుడయ్యారు. ఇతర సంగీత దర్శకుల పాటలు పాడుతూనే దాదాపు 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు ఘంటసాల. ఇది సామస్యమైన విషయం కాదు. ఆయన సంగీతంలోని మాధుర్యం గురించి తెలిసిన ఆయన సన్నిహితులు, చిత్ర ప్రముఖులు ‘తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల తీరని అన్యాయం చేశారు’ అనేవారు. సింగర్‌గా కాకుండా సంగీత దర్శకుడిగా కొనసాగి ఉన్నట్టయితే కొన్ని వందల సినిమాల్లో వేలకొద్దీ అద్భుతమైన పాటల్ని అందించి ఉండేవారు. ఆ విధంగా తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల వల్ల తీరని నష్టం జరిగింది అనేది వారి అభిప్రాయం.