English | Telugu
షైన్ టామ్ చాకోని ఆరాధిస్తున్నానంటున్న విన్సీ.. క్షమాపణలు చెప్పిన షైన్
Updated : Jul 8, 2025
దసరా, దేవర పార్ట్ 1 ,డాకు మహారాజ్ వంటి హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom Chacko). మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన షైన్ 2002 లో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పటి వరకు సుమారు ఎనభైకి పైగా చిత్రాల్లో వివిధ క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని నెలల క్రితం షైన్ గురించి ప్రముఖ మలయాళ నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)మీడియా సమక్షంలో మాట్లాడుతు ఒక సినిమా షూటింగ్ సమయంలో షైన్ డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి గాయపరిచాడని చెప్పింది. మలయాళ ఫిలింఛాంబర్ తో పాటు పోలీసులకి కూడా విన్సీ ఫిర్యాదు చెయ్యడంతో షైన్ పై కేసు నమోదయ్యింది. అప్పట్లో ఈ విషయం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
ఇప్పుడు షైన్ , విన్సీ కలిసి 'సూత్రవాక్యం'(Soothravakyam)అనే సినిమాలో నటించారు. డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో షైన్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషించాడు. ఈ నెల 11 న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో షైన్ అండ్ విన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షైన్ మాట్లాడుతు 'విన్సీ విషయంలో నా ప్రవర్తన తీరు పట్ల తనకి క్షమాపణలు చెపుతున్నాను. విన్సీ కి ఎటువంటి హానీ కలిగించే ఉదేశ్యం నాకు లేదు. నేను సరదాగా చేశాను. కానీ విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఆమె వెనుక ఎవరో ఉండి ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత విన్సీ మాట్లాడుతు నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తనని అసలు ఊహించలేదు. ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడ్డాను. నేను స్పందించిన తీరు చాకో కుటుంబాన్ని ఎంతో బాధకి గురి చేసింది. ఇప్పుడు ఆ బాధ ముగిసిందని చెప్పుకొచ్చింది. షైన్ ఇటీవల డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.