English | Telugu

ఒకేరోజు ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్.. టెన్షన్‌లో నిర్మాతలు!

ఒకేరోజు ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్.. టెన్షన్‌లో నిర్మాతలు!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ డమ్‌ గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్‌ కోసం ఐదు సంవత్సరాల గ్యాప్‌ తీసుకున్న ప్రభాస్‌ ఆ తర్వాత తన సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచారు. 2017లో బాహుబలి 2 విడుదలైంది. ఈ ఏడు సంవత్సరాల గ్యాప్‌లో ప్రభాస్‌ నటించిన 5 సినిమాలు విడుదలవడమే దానికి నిదర్శనం. ప్రస్తుతం రాజా సాబ్‌ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ ఈ సినిమా తర్వాత ఫౌజీ, సలార్‌2, కల్కి2.. ఇలా వరసగా సినిమాలు చేయబోతున్నారు. సినిమా, సినిమాకీ తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్న ప్రభాస్‌ ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలూ ఓకే రోజు రిలీజ్‌ అవ్వడం విశేషం. 

విషయమేమిటంటే.. అక్టోబర్‌ 23న తన 45వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు ప్రభాస్‌. ఈ సందర్భంగా ప్రభాస్‌ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్‌’తోపాటు ‘డార్లింగ్‌’ చిత్రాన్ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమధ్యకాలంలో రీరిలీజ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్‌లో కూడా భారీ కలెక్షన్స్‌ సాధిస్తూ రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి. ఆ రెండు సినిమాలు రిలీజ్‌ అయినపుడు ప్రభాస్‌ స్థాయి వేరు, ఇప్పటి రేంజ్‌ వేరు. కాబట్టి అతను నటించిన ఏ సినిమా రీరిలీజ్‌ చేసినా కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని అభిమానులు ఎంతో హ్యాపీగా చెబుతున్నారు. 

ప్రభాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్‌ నిర్మించిన ‘ఈశ్వర్‌’ 2002 నవంబర్‌ 11న విడుదలై ఘనవిజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఆ తర్వాత ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన ‘డార్లింగ్‌’ చిత్రం 2010 ఏప్రిల్‌ 23న విడుదలై సూపర్‌హిట్‌ అయింది. రూ.22 కోట్ల షేర్‌ సాధించి ఆరోజుల్లోనే రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పుడీ రెండు సూపర్‌హిట్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి రీరిలీజ్‌లో ‘ఈశ్వర్‌’, ‘డార్లింగ్‌’ కలెక్షన్లపరంగా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాయో చూడాలి.