English | Telugu
రెట్రో మూవీ రివ్యూ
Updated : May 1, 2025
సినిమా పేరు: రెట్రో
తారాగణం: సూర్య, పూజాహెగ్డే, ప్రకాష్ రాజ్, నాజర్, జోజుజార్జ్, బేబీ అవని, జయరాం, కరుణాకరన్, శ్వాసిక,సుజిత్ శంకర్ తదితరులు
మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
ఫొటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: షఫీక్ మహ్మద్ అలీ
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్
బ్యానర్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్ టైన్మెంట్
విడుదల తేదీ: మే 1 , 2025
కంగువ ప్లాప్ తర్వాత స్టార్ హీరో సూర్య(Suriya)ఈ రోజు 'రెట్రో'(retro)మూవీతో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలు బాగుండటం, కార్తీక్ సుబ్బరాజ్(karthik Subbaraj) డైరెక్టర్ కావడంతో 'రెట్రో' పై మంచి హైప్ కూడా క్రియేట్ అయ్యింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
ఉదరం పై కృష్ణుడి పాదాలతో పుట్టిన పారి కన్నన్ (సూర్య) ఒక అనాధ. ఆ పేరు కూడా పెంచిన తల్లి(శ్వాసిక) పెడుతుంది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసిన నవ్వు అనేది మాత్రం పారి ముఖంలో రాదు. ఆమె భర్త తిలక్( జోజు జార్జ్) రౌడీ షీటర్, స్మగ్లర్ కావడంతో పారి కూడా అవే పనులు చేస్తుంటాడు. పారి అంటే తిలక్ కి ఏ మాత్రం ఇష్టం ఉండదు. రౌడీ షీటర్ గా ఉపయోగపడుతున్నాడని మాత్రమే చేరదీస్తాడు. రుక్మిణి(పూజా హెగ్డే) పారి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. రౌడీయిజాన్ని వదిలేసానని రుక్మిణికి మాట ఇచ్చి ఇద్దరు పెళ్లికి సిద్ధం అవుతారు. కానీ పారిని తిలక్ చంపడానికి ప్రయత్నం చెయ్యడంతో పారి ఎదురుతిరగడంతో పెళ్లి ఆగిపోతుంది. ఆ క్రమంలో పారి జైలుకి వెళ్తాడు. రుక్మిణి అండమాన్ లోని ఒక దీవిలో ఉంటు ఉంటుంది. ఆ దీవిని బ్రిటిష్ వాళ్ల నుంచి హక్కుగా పొందిన రాజ్ వేల్(నాజర్), అతని కొడుకు మైకేల్ అక్కడి ప్రజలని బానిసలుగా చేసుకుంటారు. ప్రాణాలతో చెలగాటమాడే రబ్బర్ కల్ట్ ఆటలు ఆడుతు ప్రాణాలు కూడా తీస్తుంటారు. తమ కుల దైవం చెప్పినట్టుగా 'జడముని' అనే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటారు. ఐదు సంవత్సరాల తర్వాత పారి జైలు నుంచి పారిపోయి అండమాన్ వచ్చి మైకేల్ తో జత కడతాడు. పారి మైకేల్ తో ఎందుకు జత కట్టాడు? పారి, రుక్మిణి ప్రేమ ఏమైంది? జడముని ఎవరు? పారి నవ్వకపోవడం వెనక కథ ఏమైనా ఉందా? పారిని తిలక్ ఎందుకు చంపాలనుకున్నాడు? పారి ఉదరం మీద కృష్ణుడి పాదాలు ఎందుకు ఉన్నాయి? రాజ్ వేల్, మైకేల్ నుంచి అక్కడి వాళ్ళని జడముని కాపాడాడా? పారి నిజంగా అనాధనా లేక అతనికి ఏమైనా కథ ఉందా? అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
ఇలాంటి కథలు సిల్వర్ స్క్రీన్ పై చాలానే వచ్చాయి. కానీ కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, సూర్య పెర్ ఫార్మెన్స్, ఆహార్యం, నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ మెప్పించాయి. దీంతో పాత కథని చూస్తున్నామనే ఫీలింగ్స్ ని రానివ్వలేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సూర్య క్యారక్టర్ కి సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి. పూజాహెగ్డే, సూర్య మధ్య ప్రేమకి సంబంధించిన సన్నివేశాలని ఎంటర్ టైన్మెంట్ కోణంలో మరింతగా చూపించాల్సింది. తద్వారా ప్రేక్షకులకి కొంచం రీలీఫ్ ఉండేది. జైలులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, అండమాన్ సన్నివేశాలు ఫస్ట్ ఆఫ్ కి హైలెట్ గా నిలిచాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సూర్య పోరాట సన్నివేశాలతో పాటు,అసలు తానెవరో తెలుసుకునే సన్నివేశాలు బాగున్నాయి. కాకపోతే కొంచం లాగ్ గా ఉంది. పైగా కథ యొక్క అంతిమ లక్ష్యం ప్రేక్షకుడికి ముందుగానే అర్ధమవుతుంది. ఇదొక్కటే కొద్దిగా మైనస్ గా మారే అవకాశం ఉంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుండంతో పాటు కొత్తగా ఉంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
సూర్య ఎప్పటిలాగే తన క్యారక్టర్ లో విజృంభించి నటించాడు. అసలు పారి కన్నన్ అనే క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేంతలా జీవించాడని చెప్పవచ్చు. సెంటిమెంట్, యాక్షన్, డాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ లో తనకి తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు. రుక్మిణి క్యారక్టర్ లో పూజా హెగ్డే తాను ఎంత వాల్యుబుల్ నటినో మరోసారి అర్థమయ్యేలా చేసింది. పెర్ ఫార్మెన్స్ పరంగా ఆమెకి నూటికి నూరు మార్కులు ఇవ్వచ్చు. పారి తండ్రి క్యారక్టర్ లో జోజుజార్జ్ కూడా అద్భుతంగా పెర్ ఫార్మ్ చేసాడు. ఇక మిగతా పాత్రల్లో చేసిన ప్రకాష్ రాజ్,నాజర్, జయరామ్, కరుణాకర్, సుజిత్ శంకర్, శ్వాసిక తమ క్యారెక్టర్లు మాత్రమే కనపడేలా నటించారు. నాజర్ సన్ గా చేసిన ఆర్టిస్ట్ కూడా సూపర్ గా చేసాడు. శ్రేయాస్ కృష్ణ ఫొటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ లెంట్. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్క్షన్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా హైలెట్.
ఫైనల్ గా చెప్పాలంటే కథ కధనాలు రొటీన్ అయినా కూడా అవేమి పట్టించుకోని రీతిలో సూర్య వన్ మాన్ షో, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులని మెప్పిస్తుంది.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం
