English | Telugu
రామూ నోటి నుంచి ఎట్టకేలకు అభినందనలు
Updated : Mar 4, 2016
శుభం పలకరా... అంటే మరేదో అన్నడట. సామాన్యంగా రామ్‌గోపాల్‌వర్మ చేసే ట్వీట్లన్నీ సాధారణంగా ఇలాగే ఉంటాయి. తన జోలికి వచ్చినా రాకున్నా అవతలివారి మీద రాళ్లో, మరీ కుదిరితే కాస్త బురదో కుమ్మరించకుండా ఊరుకోరు రామ్. అందుకే ఆయన ట్విట్టర్‌ను ఫాలో అయితే చాలు, కావల్సినంత మసాలా దొరుకుతుంది. అలాంటి ఈ దర్శకుడు నిన్న ఊర్మిళను మనసారా అభినందిస్తూ తన శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. ‘నేను ఇప్పటివరకూ పనిచేసిన వారందిరలోకీ అత్యంత అందమైన ఊర్మిళ వివాహం గురించి విని సంతోషం కలిగింది. ఆమె జీవితం ఎప్పటికీ రంగీలాలా సాగిపోవాలని కోరుకుంటున్నాను’ అంటూ రామ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 42 ఏళ్ల ఊర్మిళ నిన్న తన ప్రేమికుడు మొహసిన్ అక్తర్‌తో ఆర్బాటం లేకుండా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే! రంగీలా, సత్య, భూత్, దౌడ్, జంగిల్... తదితర వర్మ చిత్రాలలో నటించిన ఊర్మిళ నట జీవితంలో, రామూ అందించిన హిట్లు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కనిపించవు.