English | Telugu

ర‌జ‌నీకాంత్ 'అన్నాత్తే' పోస్ట‌ర్‌పై మేక ర‌క్తం పోసిన‌ ఫ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌!

ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'అన్నాత్తే' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌పై ఆయ‌న అభిమానులు మేక ర‌క్తం పోయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయితే వారి చ‌ర్య‌ను అస‌హ్య‌క‌రం అంటూ ర‌జ‌నీ వైపు నుంచి ఘాటైన స్పంద‌న వ‌చ్చింది. ఆల్ ఇండియా ర‌జ‌నీకాంత్ ర‌సిక‌ర్ మండ్ర‌మ్ (ఫ్యాన్స్ క్ల‌బ్‌) అడ్మినిస్ట్రేట‌ర్, ర‌జ‌నీకి అత్యంత స‌న్నిహితునిగా చెప్ప‌బ‌డే వి.ఎం. సుధాక‌ర్ ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించ‌డ‌మే కాకుండా, దాన్ని విచార‌క‌రమైందిగా అభివ‌ర్ణించాడు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఓ వీడియోలో ర‌జ‌నీకాంత్ అభిమానులుగా భావిస్తున్న కొంత‌మంది వ్య‌క్తులు ఒక మేక‌ను న‌రికి, దాని ర‌క్తాన్ని 'అన్నాత్తే' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌పై పోస్తుండ‌టం క‌నిపించింది. భ‌యాన‌కంగా క‌నిపిస్తోన్న వారి చ‌ర్య‌ను అత్యంత క్రూర‌మైన‌దిగా పేర్కొంటూ అంద‌రూ ఖండిస్తున్నారు.

త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్ యాక్ట‌ర్స్ క‌టౌట్ల‌కు వారి వీరాభిమానులు పాలాభిషేకం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ మేక ర‌క్తంతో వాటిని త‌డ‌ప‌డం లాంటిది ఇదివ‌ర‌కెన్న‌డూ విని వుండ‌లేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన వీడియో గురించి ప్ర‌స్తావిస్తూ, "ఇది విచార‌క‌రం మాత్ర‌మే కాదు, తీవ్రంగా ఖ‌డించ‌ద‌గ్గ‌ది." అని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు సుధాక‌ర్‌. "ఇలాంటి అస‌హ్య‌క‌ర‌మైన ప‌నుల్లో ఎవ‌రూ పాల్గొన‌వ‌ద్ద‌ని మేం కోరుతున్నాం" అని ఆయ‌న అర్థించాడు.

మీనా, ఖుష్‌బూ, న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్ లాంటి తార‌లు న‌టిస్తోన్న 'అన్నాత్తే' మూవీని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.