English | Telugu
ప్రభాస్ కోసం అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్!
Updated : Aug 11, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి నాన్ స్టాప్‌గా కష్టపడుతున్నారు. వాటిలో సలార్ ఒకటి కాగా.. రెండో సినిమా ప్రాజెక్ట్ కె. ఇది కాకుండా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో సినిమా కూడా సెట్స్‌పై ఉంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అవేవో అందరికీ తెలిసిందే. వీటిలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా కూడా ఉంది. ఇది ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 25వ సినిమా. ఈ సినిమాను టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.
ఇప్పటి వరకు ప్రభాస్ ఏ సినిమాలోనూ పోలీస్ ఆఫీసర్‌గా నటించలేదు. తొలిసారి ఆయన ఖాకీ దుస్తుల్లో రౌడీలను రఫ్ ఆడించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది. ఇంతకు ముందు సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్.. స్పిరిట్ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాల్లో సలార్..సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న కల్కి 2898 సినిమా రిలీజ్ కానుంది. మరో వైపు సందీప్ సైతం రణ్‌భీర్ కపూర్‌తో చేసిన యానిమల్‌ను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. దీని తర్వాతే ఆయన స్పిరిట్‌పై పూర్తి స్థాయిలో వర్క్ చేయబోతున్నారు.