English | Telugu
పవన్ సర్దార్ ఫలితం ఎందుకు ఇలా వచ్చింది..?
Updated : Apr 9, 2016
పవన్ కళ్యాణ్. ఈ పేరు ఓ ప్రభంజనం. ప్రకంపనం. ఆయన సినిమా వస్తే చాలు థియటర్ల దగ్గర పూనకం. పవన్ కు ఒకప్పుడు వరస ఫ్లాపులతో ఊపిరి ఆడలేదు. తనకు ఏ టైప్ మూవీస్ సెట్ అవుతాయో, ఏం చేస్తే మళ్లీ హిట్ కొట్టచ్చో పవన్ కు తెలియలేదు. అప్పటికి ఆయన క్రేజ్ కూడా డౌన్ అయిపోయింది. ఇలాంటి టైం లో ఏడారిలో ఒయాసిస్ లా ఆయనకు గబ్బర్ సింగ్ దొరికింది. హరీష్ శంకర్ కు స్వతహాగా ఉండే కామెడీ సెన్స్, పవన్ లో హ్యూమర్ టచ్ మిక్స్ అయిన గబ్బర్ సింగ్, పవన్ ను తీసుకొచ్చి ఆకాశంలో నిలబెట్టింది. మళ్లీ పవన్ మ్యానియా మొదలైపోయింది. ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేదితో ఫ్యాన్ బేస్ పూర్తిగా బలపడింది.
ఖుషీ టైం లో ఉన్నప్పటి కంటే ఎక్కువగా పవన్ మ్యానియాతో యూత్ ఊగిపోతున్నారు. ఇలాంటి టైంలో, గబ్బర్ సింగ్ రీమేక్ ను ఎంచుకుని, ఇంకో భారీ హిట్ కు ప్లాన్ చేశాడు పవర్ స్టార్. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే తనదే కావడం, ముగ్గురు నలుగురు దర్శకత్వ పర్యవేక్షణతో హడావిడిగా షూటింగ్ జరిపించడం లాంటివి సినిమాను దెబ్బ తీశాయి. కేవలం బాబీ చేతిలో తన కథ,కథనాలు పెట్టేసి తీసెయ్ రా అబ్బాయ్ అంటే పవన్ కు మినిమం హిట్ పడేదే. కానీ కలగూర గంపలా మారిపోవడంతో, జనాలకు సినిమా ఎలా ఉందో కూడా అర్ధం కాకుండా థియేటర్ బయటికి వస్తున్నారు. ఫస్ట్ టు లాస్ట్ పవన్ నే చూపిస్తూ, సినిమా ఎంత వరకూ నడిపించగలరు. పవన్ తో పాటు కాస్త కథ కనబడుతుంటేనే, సినిమాకు అందం వస్తుంది. గబ్బర్ సింగ్ లో ఉన్నది, ఇక్కడ లేనిది అదే.
జానీ తో పవన్ కు ఒక భారీ స్ట్రోక్ తగిలింది. ఇప్పుడు సర్దార్ తో రెండోది. ఎన్నో ఫ్లాపులుండగా, ఈ రెండింటినే స్టోక్స్ అని ఎందుకంటారంటే, ఇవి పవన్ చాలా మనసు పెట్టి, కథ కథనాలు సమకూర్చుకున్న సినిమాలు. ఫ్లాపులు వచ్చినప్పుడు పడే బాధ వేరు. ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు ఫ్లాపైతే వచ్చే ఆవేదన వేరు. ప్రస్తుతం పవన్ ఈ మోడ్ నుంచి బయటపడాలి. తనలో ఎంత డైరెక్టోరియల్ టాలెంట్ ఉన్నా, దాన్ని పక్కన పెట్టి కేవలం హీరోగా మాత్రమే సినిమాకు పనిచేయాలి. ఎందుకంటే, పవన్ ను ఎలా చూపించాలో ఆయన కంటే, డైరెక్టర్లకే బాగా తెలుసు. ఒకవేళ ఆయన స్క్రిప్ట్ లో వేలుపెడితే, అది బాగోకపోయినా పవన్ మీద గౌరవంతో ఆ విషయం ఆయనకు చెప్పరు. మారు మాట్లాడకుండా ఆయన చెప్పిందే తీసేస్తారు. ఇలాంటి సిట్యువేషనే ఇప్పుడు సర్దార్ కు ఎదురైంది. తన తర్వాతి ప్రాజెక్ట్స్ నుంచి, పవన్ మళ్లీ డైరెక్టర్ కే సినిమా వదిలేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అభిమానులు పవన్ ను మాత్రమే కాదు, ఆయన హిట్ సినిమాల్ని కూడా చూడాలనుకుంటారు కదా..!
సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ ఇక్కడ చూడండి..!
http://teluguone.com/tmdb/news/Sardaar-Gabbar-Singh-Review-tl-58131c1.html