English | Telugu

ప‌వ‌న్‌... తాట తీయ్య‌డం మ‌రిచాడు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ లో కావ‌ల్సినంత ఆలోచ‌న‌, అనుకొన్న దానికంటే ఎక్కువ ఆవేశం క‌నిపిస్తుంటాయి. అయితే ఆలోచ‌న‌మాటేమో గానీ, ఆయ‌న ఆవేశం మాత్రం క్ష‌నిక‌మే. ఈ విష‌యం చాలా సార్లు బ‌య‌ట‌ప‌డింది. కోటి రూపాయ‌ల ప్రారంభ‌నిధితో కామ‌న్‌మెన్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ అనేది ఒక‌టి పెట్టాడు. ఆ త‌ర‌వాత ఆ మాటే మర్చిపోయాడు. జ‌న‌సేన పార్టీని ప్రారంభించాడు.. ఎన్నిక‌లు పూర్త‌యి ఇన్ని రోజులైనా, దానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ క‌మీటీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఖ‌రారు చేయ‌లేదు. క‌నీసం పార్టీ ప‌నిచేస్తోందా, లేదా అన్న‌ది ఇప్ప‌టికీ అనుమాన‌మే. ఆఖ‌రికి సినిమా వేదిక‌ల‌పై చూపించిన ఆవేశం కూడా క‌నుమ‌రుగైపోయింది. రెండేళ్ల క్రితం అత్తారింటికి దారేది ఫ‌స్టాఫ్ లీకయ్యింది. సినిమాలోని ఒక‌ట్రెండు సీన్స్‌, పాట బ‌య‌ట‌కు రావ‌డం కాదు, ఏకంగా స‌గం సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌యిపోయి... ఇండ్ర‌స్ట్రీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. అత్తారింటికి స‌క్సెస్ మీట్లో లీకు వీరుల‌పై ప‌వ‌న్ ఊగిపోయాడు. వాళ్లెవ‌రో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెట్టి తాట‌తీస్తాన‌ని హెచ్చ‌రించాడు. ఈ లీకేజీ వ్య‌వ‌హారం వెనుక కొంత‌మంది సినీ పెద్ద‌లు కూడా ఉన్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. వాళ్లంద‌రినీ ప‌వ‌న్ టార్గెట్ చేయ‌డం ఖాయ‌మ‌ని... ప‌వ‌న్ వాళ్ల‌ని ఊరికే వ‌ద‌ల‌డ‌ని చెప్పుకొన్నారు. అయితే అదంతా తుస్సుమంది. ఆ త‌ర‌వాత ఎప్పుడూ లీకేజీ గురించి ఎవ‌రూ మాట్లాడ‌లేదు. ప‌వ‌న్ కూడా సైలెంట్ అయిపోయాడు. లీకేజ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టినా, అందులోని వ్య‌క్తుల పేర్లు మాత్రం అత్తారింటికి చిత్ర‌బృందం తెలుప‌డానికి ఇష్టం చూపించ‌డం లేద‌ని తేలింది. మరి ప‌వ‌న్ తాట తీస్తానన్న మాట మ‌ర్చిపోయాడా?? లేదంటే దొరికింది అచ్చంగా త‌న వాళ్లేనా..?? ఇటీవ‌లే బాహుబ‌లిలోని 12 నిమిషాల వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. లీకేజీ వీరులు దొరికారు. వాళ్లు ఇప్పుడు క‌ట‌క‌టాల ఊచ‌లు లెక్కపెడుతున్నారు. స‌గం సినిమా లీక్ చేసిన వాళ్ల‌ని మాత్రం ప‌వ‌న్ వ‌దిలేశాడు. ఎందుకిలా?? అన్న ప్ర‌శ్న మాత్రం ప‌వ‌న్ అభిమానుల్ని ఇంకాఇంకా వేధిస్తోంది.