English | Telugu
పవన్ అంటే మరీ ఎటకారమైపోయింది
Updated : Mar 14, 2016
పవన్ కల్యాణ్ తుమ్మినా, దగ్గినా... దాన్నిజూమ్‌లో చూసి, క్లోజప్ షాట్ వేసుకొని మరీ ఆనందిస్తుంటాడు రాంగోపాల్ వర్మ. పవన్ మాటల్ని, ప్రవర్తననీ, ఆఖరికి పవన్‌పై పుట్టే వార్తల్నీ వీలైనంత వక్రీకరించనిదే తిన్నది అరగదు ఆయనకు. ట్వీట్టర్ ముందు కూర్చుంటే... పవన్ ప్రస్తావన రాకూండా కామెంట్ ముగించడం కూడా చేతకాదాయె. పవన్ ఫ్యాన్స్ కి కెలక్కుంటే.. తనకు పాపులారిటీ రాదని ఏనాడో ఫిక్సయిపోయిన వర్మ.. తాజాగా పవన్‌పై మరో సెటైర్ వేశాడు. ఈసారి.. అనుపమ చోప్రాకి పవన్ ఇచ్చిన ఇంటర్వ్వూపై వర్మ కళ్లు పడ్డాయి. ప్రతీసారీ పవన్‌ని, పవన్ ఫ్యాన్స్‌నీ రెచ్చగొడుతూ కామెంట్లు చేస్తే బాగోదు అనుకొన్నాడో ఏమో.. ఈసారి మాత్రం పొగిడినట్టు యాక్ట్ చేశాడు.
పవన్‌తో అనుపమ ఇంటర్వ్యూచూశా.. అదో అద్భుతం. నా జీవిత కాలంలో ఇలాంటి ఇంటర్వ్యూ చూళ్లేదు. చాలా స్ఫూర్తిదాయకంగాసాగింది.. అంటూ డబ్బా కొట్టడం మొదలెట్టాడు వర్మ. ఆయన ట్విట్లు చూస్తుంటే.. ఎటకారం పాళ్లు ఎక్కువైనట్టే కనిపిస్తున్నాయి. తన కామెంట్లను పవన్ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకొంటారేమో అని భయపడిన వర్మ.. తనపై ఒట్టుకూడా వేసుకొన్నాడు. అంతేనా.. అంటే ఇంకా చాలా ఎకసెక్కాలు చేశాడు. పవన్ ఇంటర్వ్యూ తనకు చాలా బాగా నచ్చిందని, కావాలంటే చంద్రబాబు నాయుడు, మోడీలపై ఒట్టు... అన్నట్టు మాట్లాడుతున్నాడు వర్మ. పవన్ అంటే వర్మకి మరీ ఇంత ఎటకారం అయిపోయిందేంటి చెప్మా..??? బహుశా.. ఇలా రివర్స్‌లో ట్విట్లు చేస్తే గానీ పవన్ ఫ్యాన్స్ దృష్టిలో పడనేమో అని వర్మ ఫిక్సయిపోయుంటాడు. కాకపోతే వర్మ మాటల్ని, చేష్టల్నీ, ఇలాంటి పిచ్చి రాతల్నీ జనం పట్టించుకోవడం ఎప్పుడో మానేశారన్న నిజాన్ని.. వర్మ ఎప్పుడు గ్రహిస్తాడో. అప్పటికి గానీ ఈ పిచ్చి రాతల నుంచి మనకు విముక్తి దొరకదు.