English | Telugu
నయనతారను టార్గెట్ చేసిన నెటిజన్లు.. సాయం చేయడం తప్పయిందా?
Updated : Dec 8, 2023
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును ఎలా కుదిపేస్తోందో మనం చూస్తున్నాం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయిపోగా ఇప్పటివరకు తుపాను తాకిడికి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చెన్నయ్ నగరం ఈ తుపాన్ వల్ల ఎక్కువ నష్టపోయింది. నగరమంతా జలయం కావడం, జన జీవనం స్తంభించిపోవడం ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ తుపాను ప్రభావం ఎపి కంటే తమిళనాడులోనే ఎక్కువ ప్రభావం చూపింది. తుఫాన్ తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే చెన్న నగరం కోలుకుంటోంది. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.
తుపాను బాధితులను ఆదుకునేందుకు తమిళ సినిమా ఇండస్ట్రీ కదిలింది. పలువురు సినీ ప్రముఖులు విరాళాల ద్వారా తమ సహాయాన్ని అందించారు. అందులో భాగంగానే హీరోయిన్ నయనతార కూడా తన వంతు సాయాన్ని అందించారు. ఆమధ్య నయనతార ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఫెమి9’ సంస్థ ఆధ్వర్యంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జి సమీపంలోని ప్రాంతాల వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫుడ్స్‌తో పాటు, వాటర్ బాటిల్స్, శానిటరీ న్యాప్ కిన్లు అందించారు. నయనతార ఉదార మనసును నగర ప్రజలతోపాటు నెటిజన్లు, అభిమానులు మెచ్చుకుంటున్నారు. మంచి పని చేసినా దాన్ని విమర్శించేవారు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నయనతారకు ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. వరద బాధితులకు అందించిన ఫుడ్స్, వాటర్ బాటిల్స్‌ను ఫెమి9కు చెందిన వాహనాల్లో తీసుకొచ్చారు. ఆ వాహనాలకు ఫెమి9 బోర్డులు ఉండడం, సహాయం చేస్తున్న వీడియోలను ఆ సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం వంటివి విమర్శలకు కారణమయ్యాయి. వీడియో చివరలో కొంతమంది మహిళలు నయనతారకు కృతజ్ఞతలు చెబుతున్న క్లిప్పింగ్స్‌ను కూడా పెట్టారు. దీన్ని చూసి కొందరు విమర్శిస్తున్నారు. ఆ మహిళలను బలవంత పెట్టి సీన్ చిత్రీకరించారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయాన్ని కూడా మీ బిజినెస్ కోసం వినియోగించుకుంటున్నారా..? మీ కంపెనినీ ప్రమోట్ చేస్తున్నారా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇలాంటి ఆపద సమయంలో సహాయం చెయ్యడానికి ముందుకు రావడమే గొప్ప విషయం. దాన్ని కూడా విమర్శించడం సరికాదని, కంపెనీ వాహనాలు వాడినంత మాత్రాన పోయేదేముందని కొందరు వాదిస్తున్నారు. ఏ స్వచ్ఛంద సంస్థ అయినా తమ సంస్థ పేరుతోనే సాయం చేస్తుంది తప్ప విడిగా కాదు కదా. అలాంటప్పుడు నయనతార కంపెనీని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా నయనతార మంచి మనసుతో సేవా కార్యక్రమాలను చేస్తున్న నయనతారను తప్పకుండా అభినందించాల్సిందే.