English | Telugu

కింగ్‌స్టన్‌ సాహసాలు నచ్చడం వల్లే నిర్మాతగా మారాను

‘చికుబుకు చికుబుకు రైలే..’, ‘ఆకతాయి ఒక్కడంట, రాలుగాయి ఒక్కడంట.... దొంగ దొంగ’ అంటూ ఆరేళ్ళ వయసులోనే ‘జెంటిల్‌మేన్‌’, ‘దొంగ దొంగ’ చిత్రాల్లో పాటలు పాడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన జి.వి.ప్రకాష్‌ ‘వెయిల్‌’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. ప్రేమిస్తే భరత్‌ ఈ సినిమాలో హీరో. ఆ తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. రజనీకాంత్‌ ‘కుసేలన్‌’ చిత్రంలో స్క్రీన్‌పై కనిపించి నటుడిగాను, సింగర్‌గానూ తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోలు పలు సినిమాలు చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జి.వి.ప్రకాష్‌.. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ మేనల్లుడు. ఈ మల్టీ టాలెంటెడ్‌ నిర్మాతగా కూడా మారారు. ఆ వివరాల్లోకి వెళితే..

నూతన దర్శకుడు కమల్‌ ప్రకాశ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ జి.వి.ప్రకాష్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో చెన్నయ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కమల్‌హాసన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఈ సినిమాలో జి.వి.ప్రకాష్‌ హీరోగా నటిస్తూ సంగీతం అందిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది అని దర్శకుడు కమల్‌ చెప్పారు. ‘కింగ్‌స్టన్‌’ పేరుతో రూపొందే ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోగా, సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారడానికి కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు ‘కమల్‌ ప్రకాశ్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందులో హీరో చేసే సాహస విన్యానాలు నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్‌ చేశాయి. అందుకే నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నాను’’ అన్నారు.