English | Telugu

‘కన్నప్ప’తో మంచు విష్ణు 100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నారా?

‘కన్నప్ప’తో మంచు విష్ణు 100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నారా?

93 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అపురూపమైన సినిమాలు, ఎన్నో కళాఖండాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ 9 దశాబ్దాల్లో ఎన్నోసార్లు తెలుగు సినిమా తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. గతంలో ఎలా ఉన్నా గత పదేళ్ళుగా తెలుగు సినిమా స్థాయి ఎంతగా విస్తరించిందో అందరికీ తెలిసిందే. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు సినిమా తన ఉనికిని చాటుకుంటోంది. అందులో భాగంగానే తెలుగు సినిమా మార్కెట్‌ పరంగా బాగా విస్తరించింది. ప్రతి హీరో, ప్రతి దర్శకనిర్మాత తమ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు ఈ ధోరణి కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సినిమాలు కలెక్షన్లపరంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ప్రతి హీరో మంచి విజయాలు అందుకుంటూ కలెక్షన్లపరంగా తాము ఎవరికీ తక్కువ కాదు అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ కలెక్షన్ల రేస్‌లో కనుచూపు మేరలో మంచు ఫ్యామిలీ హీరోలు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి టాప్‌ హీరోలు సూపర్‌హిట్‌ సినిమాలతో దూసుకెళ్తున్న రోజుల్లో తన విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయిన హీరో మోహన్‌బాబు. ఆరోజుల్లో కలెక్షన్‌ కింగ్‌ అనే పేరు తెచ్చుకున్నారంటే ఆయన చేసిన సినిమాలు ఏ రేంజ్‌లో కలెక్ట్‌ చేసేవో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్‌కింగ్‌ వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్‌.. ఆ స్థాయి కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా చేయలేదు. మంచు విష్ణు చేసిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు మాత్రం ఏ సినిమాకీ రాలేదు. అలాగే మంచు మనోజ్‌ చేసిన సినిమాలు కూడా కలెక్షన్లను ప్రభావితం చేయలేకపోయాయి. మోహన్‌బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన విష్ణు, మనోజ్‌.. ఆయన కలెక్షన్ల ప్రభంజనాన్ని మాత్రం వారసత్వంగా తీసుకోలేకపోయారు. 

ఇటీవలికాలంలో చాలా మంది యంగ్‌ హీరోలు అనూహ్యంగా తమ సినిమాల ద్వారా భారీ కలెక్షన్లు సాధించారు. నాని, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి హీరోలు తమ సినిమాల ద్వారా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. వీరంతా ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా తమని తాము ప్రూవ్‌ చేసుకున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కానీ, నటుడుగా 50 ఏళ్ళ చరిత్ర కలిగిన మోహన్‌బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు, మనోజ్‌ మాత్రం ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోతున్నారు.  మంచు విష్ణు మొదటి సినిమా ‘విష్ణు’ 2003లో విడుదలైంది. ఈ 22 సంవత్సరాల్లో విష్ణు చేసిన సినిమాలేవీ కలెక్షన్ల పరంగా ఒక మార్క్‌ని చేరుకోలేకపోయాయి. అలాగే మంచు మనోజ్‌.. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ 21 సంవత్సరాల్లో మనోజ్‌ కూడా ఎలాంటి సంచలనాలు సృష్టించలేకపోయాడు. 

ఇప్పుడు మంచు ఫ్యామిలీకి ఆ అవకాశం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘కన్నప్ప’ ద్వారా మంచు విష్ణు 100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తోంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్‌లో ఇదే తొలి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలు కీలకమైన పాత్రలు పోషించడం ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. వీరి ప్రజెన్స్‌ కలెక్షన్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సినిమాకి మొదటి నుంచీ కాస్త నెగెటివ్‌ ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాతో మంచు విష్ణు కలెక్షన్ల పరంగా వివిధ క్లబ్‌లలో చేరే అవకాశం కనిపిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రంతో తాను కలెక్షన్‌కింగ్‌ వారసుడ్ని అని మంచు విష్ణు నిరూపించుకునే అవకాశం లేకపోలేదు.