English | Telugu

త్వరలోనే పవన్‌కళ్యాణ్‌గారిని కలిసి ఆ విషయం డిస్కస్‌ చేస్తాను!

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పలు భాషలకు చెందిన స్టార్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టైటిల్‌ పాత్ర పోషిస్తున్న మంచు విష్ణు ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో నెటిజన్లతో సరదాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సినిమాకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఇటీవల తమ కుటుంబంలో జరిగిన ఓ ఘటన తాలూకు ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

ఆరోజు జనరేటర్‌లో షుగర్‌ ఎందుకు కలిపావన్నా..’?
- ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్‌ పెరుగుతుందని ఎక్కడో చదివాను

‘కన్నప్ప’లో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసే అంశాలేమిటి?
- ఈ సినిమాలో మా పిల్లలు కూడా నటించారు

‘కన్నప్ప’ వాస్తవ కథతో తీశారా లేక కల్పితమా?
- మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యంలోని కన్నప్ప చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం

ఇది భారీ బడ్జెట్‌ సినిమా అంటున్నారు. ఎంతంటారు?
- నా గత చిత్రాల బడ్జెట్‌కి పది రెట్లు ఎక్కువ అని మాత్రం చెప్పగలను

ప్రభాస్‌ ఈ సినిమాలో పారితోషికం తీసుకోకుండా నటించారంటున్నారు. నిజమేనా?
- మీరు విన్నది నిజమే.

కృష్ణంరాజుగారు నటించిన ‘భక్తకన్నప్ప’లో శ్రీకాళహస్తి దేవాలయం కనిపిస్తుంది. కానీ, ‘కన్నప్ప’లో శివలింగం తప్ప దేవాలయం లేదు. ఎందుకని?
- దీనికి సమాధానం కావాలంటే ఏప్రిల్‌ 25 వరకు వెయిట్‌ చెయ్యండి

ప్రభాస్‌ చేసిన రుద్ర క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- సైలెంట్‌గా వుంటూనే వైలెంట్‌గా ఉంటుంది

ప్రీ రిలీజ్‌ ఎలా ప్లాన్‌ చేస్తున్నారు?
- శ్రీకాళహస్తిలోనే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈవెంట్‌కి పవన్‌కళ్యాణ్‌గారిని ఆహ్వానిస్తారా అని అందరూ అడుతున్నారు. త్వరలోనే ఆయన్ని అడుగుతాం. ఈ సినిమాకి ప్రీమియర్స్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాం

ప్రభాస్‌ స్పిరిట్‌లో నటించాలని ఆసక్తిగా ఉన్నారు కదా.. ఎక్కడి వరకు వచ్చింది?
- సమాధానంగా క్రయింగ్‌ ఎమోజీ పోస్ట్‌ చేశారు
100 మందికి పైగా అనాథలను చేరదీసి చదివిస్తున్నారని తెలిసింది?
- మా నాన్నగారి ద్వారా నాకు అబ్బిన విషయం ఒకటుంది. అనాథలను చేరదీయడం. అందుకే 100 మందికిపైగా అనాథలను చదివిస్తున్నాను’ అన్నారు.

మీకు ఇష్టమైన కన్నడ నటుడు ఎవరు?
- అంబరీష్‌గారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి

ఎన్టీఆర్‌పై మీ అభిప్రాయం?
- బ్రిలియంట్‌ యాక్టర్‌

భవిష్యత్తులో నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేసే ఆలోచన ఉందా?
- అవకాశం వస్తే నాకూ చెయ్యాలనే ఉంది

మీ సినిమాల్లో మీకు నచ్చినవి?
- రౌడీ, అనుక్షణం