English | Telugu
పెళ్లిని అపహాస్యం చెయ్యకండి.. ఏది ఏమైనా కొత్త జంటలను ఆశీర్వదించండి!
Updated : Aug 12, 2024
మీడియా, సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఆ ప్రభావం సమాజంపై, మనుషుల వ్యక్తిత్వాలపై పడుతోందన్నది వాస్తవం. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం, అది వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ దాన్నే అనుసరిస్తున్నారు. తమ వీడియో వైరల్ కావడానికి ఎలాంటి కొత్త మార్గాలు ఉన్నాయనేది అన్వేషిస్తున్నారు. కొన్ని థియేటర్లలో జరిగిన సంఘటనలే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. సినిమా తారలంటే అందరికీ అభిమానం ఉంటుంది. కొంతమంది అభిమానులు తమ హీరో సినిమా రిలీజ్ అయినపుడు థియేటర్లలో హంగామా చెయ్యడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ, ఆ అభిమానం కాస్త ముదిరి థియేటర్‌లోనే పెళ్లి చేసుకుంటే..
మహేష్, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘మురారి’ ఇటీవల రీ రిలీజ్ అయింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేశారు. అభిమానుల హంగామా నడుమ ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. సినిమాలోని ‘అలనాటి రామచంద్రుడు..’ అనే పాట వస్తున్న సమయంలో కొన్ని జంటలు స్క్రీన్ ముందే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనే ఆమధ్య తమిళనాడులో కూడా జరిగింది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ జంట పెళ్లిళ్లు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇలా చేసేవన్నీ సోషల్ మీడియాలో తమ వీడియోలు వైరల్ కావడానికే అనేది స్పష్టమవుతూనే ఉంది.
దీనిపై ‘మురారి’ దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ ముఖ్యమైన ఘట్టమనీ, థియేటర్లలో పెళ్లిళ్ళు చేసుకొని మన సంస్కృతినీ, సంప్రదాయాలను అపహాస్యం చెయ్యవద్దని అభిమానుల్ని కోరారు కృష్ణవంశీ. తెలిసీ తెలియక ఆ జంటలు అలా చేసి ఉంటారని, ఏది ఏమైనా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఆ పెళ్లిళ్ళకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ‘కొత్త జంటలను ఆశీర్వదించండి’ అని కామెంట్ చేస్తున్నారు.
