English | Telugu

పవన్ దెబ్బకి మరో హీరోని చూసుకున్న డైరెక్టర్ క్రిష్!

పవన్ దెబ్బకి మరో హీరోని చూసుకున్న డైరెక్టర్ క్రిష్!

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అవుతోంది. ఈ పీరియాడిక్ ఫిల్మ్ తో పవన్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. అయితే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. బాగా ఆలస్యమవుతోంది. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉండటం, మరోవైపు ఈ సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో.. పవన్ తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తయ్యే సినిమాలు చేస్తున్నారు. అలా 'హరి హర వీర మల్లు'కి బ్రేక్ ఇచ్చి.. 'భీమ్లా నాయక్', 'బ్రో' సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలోపు 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే పవన్ మళ్ళీ 'హరి హర వీర మల్లు'కి డేట్స్ కేటాయించే అవకాశముంది. అంటే దర్శకుడు క్రిష్ మరో ఏడాది ఎదురుచూడక తప్పదు. అందుకే క్రిష్ ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని భావిస్తున్నారట.

'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకులుగా క్రిష్ పేరు తెచ్చుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన కెరీర్ సాఫీగా సాగడంలేదు. పేరుకి మూడేళ్ళ క్రితం పవన్ తో 'హరి హర వీర మల్లు' చిత్రం చేసే అవకాశమైతే వచ్చింది కానీ.. ఒక అడుగు ముందుకి, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఆ సినిమా అడుగులు పడుతున్నాయి. 'హరి హర వీర మల్లు' మొదలయ్యాక లాక్ డౌన్ సమయంలో క్రిష్.. మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో 'కొండపొలం' సినిమా చేశాడు కానీ, ఆ సినిమా నిరాశపరిచింది. దానికితోడు ఆ తర్వాత 'హరి హర వీర మల్లు' షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటికే చాలాకాలం ఎదురుచూసిన క్రిష్.. ఇప్పుడు మాత్రం వచ్చే ఏడాది వేసవిలోపు ఓ సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. అందుకోసం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మరి క్రిష్ ఈ సినిమాతో విజయాన్ని అందుకొని.. ఆ జోష్ తో వచ్చే ఏడాదైనా 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని పూర్తి చేస్తారేమో చూడాలి.