English | Telugu
మీరేమైనా చరిత్రకారులా.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు
Updated : Jun 3, 2025
కమల్ హాసన్(Kamal Haasan)ఈ నెల 5 న విడుదల కాబోతున్న 'థగ్ లైఫ్'(Thug Life)ఆడియో ఫంక్షన్ లో, తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కన్నడ భాషా సంఘాలతో పాటు, కన్నడ ఫిలిం ఛాంబర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసాయి. కమల్ క్షమాపణ చెప్పకపోతే కన్నడ నాట 'థగ్ లైఫ్' రిలీజ్ ని అడ్డుకుంటామని తేల్చి చెప్పాయి. దీంతో థగ్ లైఫ్ రిలీజ్ ఆగకుండా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్ట్(Karnataka Highcourt)లో కమల్ పిటిషన్ వేసాడు.
ఈ పిటిషన్ పై హైకోర్ట్ మాట్లాడుతు 'తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. మీరేమైనా చరిత్రకారులా, లేక భాషావేత్తలా. ఏ భాష కూడా ఇతర బాషల నుంచి పుట్టదు. నీరు, నేల, భాష ప్రజలకి పవిత్రమైనవి. ప్రతి వ్యక్తి యొక్క సాంస్కృతిక, భావోద్వేగ గుర్తింపులో భాగం. భాషా ప్రాతిప్రదికనే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీరు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాల్ని దెబ్బతీశాయి. క్షమాపణ చెబితే సమస్య పరిష్కార మవుతుంది. మీరు కమల్ హాసన్ కావచ్చు. మరెవరైనా కావచ్చు. మీ సినిమా ద్వారా కర్ణాటకలో కోట్ల రూపాయలని సంపాదించాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు కన్నడ ప్రజలకి క్షమాపణ చెప్తే మీ స్థాయి ఏం తగ్గదనే ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా సరే కమల్ క్షమాపణ చెప్పకపోయే సరికి కోర్టు తన తదుపరి విచారణ ఈ నెల 10 కి వాయిదా వేసింది. దీంతో రేపు విడుదల కాబోతున్న 'థగ్ లైఫ్' కన్నడ నాట వాయిదా పడే అవకాశం ఉంది.
ఇక రిలీజ్ విషయంలో తమిళనాడు ఫిలిం చాంబర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ కి లేఖ రాసింది. సదరు లేఖలో 'ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ ఫిలిం ఇండస్ట్రీ కలిసి పని చేస్తున్నాయి. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, విజయ్ దునియా, సుదీప్ ఎందరో కన్నడ నటులు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళ నిర్మాతలు, డైరెక్టర్లు కూడా కన్నడంలో చిత్రాలని రూపొందిస్తున్నారు. థగ్ లైఫ్ ని వాయిదా వేసినా, బ్యాన్ చేసినా, ఆ నిర్ణయం భవిష్యత్తులో రెండు ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకి ఒక చరిత్ర ఉంది. కమల్ హాసన్ ప్రేమతోనే ఆ విధంగా మాట్లాడారు. ఈ విషయాన్నీ గుర్తించి 'థగ్ లైఫ్' రిలీజ్ కి సహకరించాలని లేఖలో పేర్కొంది.