English | Telugu
‘కన్నై నంబాతే’ మూవీ రివ్యూ!
Updated : Apr 18, 2023
సినిమా పేరు: కన్నై నంబాతే
తారాగణం: ఉదయనిధి స్టాలిన్, భూమిక, శ్రీరామ్, ప్రసన్న తదితరులు
సంగీతం: సిద్దు కుమార్
సినిమాటోగ్రఫీ: జలంధర్ వాసన్
నిర్మాత: VN రంజిత్ కుమార్
దర్శకత్వం: ము. మారన్
బ్యానర్: లిపి సినీ క్రాఫ్ట్స్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
కొంతకాలంగా ఇతర భాషలలో విడుదలైన పలు సినిమాలను ఓటీటీ వేదికగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అయితే అలాంటి వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఉండే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆ కోవకి చెందిందే ఈ 'కన్నై నంబాతే'. తమిళ్ లో థియేటర్లలో విడుదలై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటి? సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
అరుణ్(ఉదయనిధి స్టాలిన్) వైజాగ్ లో ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళింట్లోనే అద్దెకు దిగుతాడు. కొన్నిరోజులకి వాళ్ళ కూతురిని లవ్ చేస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి తండ్రి అరుణ్ ని రూం ఖాళీ చేయిస్తాడు. దీంతో రూమ్స్ కోసం వెతుకుతూ ఎక్కడా బ్యాచిలర్స్ కి రూమ్స్ లేకపోవడంతో.. ఒక హౌజ్ బ్రోకర్ సహాయంతో సోము(ప్రసన్న) అనే వ్యక్తితో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదేరోజు సోముతో పాటుగా అరుణ్, అతని ఫ్రెండ్ కలిసి బార్ కి వెళ్ళి మందు తాగి తిరిగి వస్తుంటారు. జోరుగా వర్షం కురుస్తుండగా దారిలో కవిత(భూమిక) మత్తులో ఉండి.. కార్ ని డ్రైవ్ చేయలేకపోతుంది. ఇంతలో అరుణ్ (స్టాలిన్) వెళ్ళి తనని కాపాడి వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అయితే కవిత తనని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి.. ఈ వర్షంలో ఎలా వెళ్తావ్, ఈ కార్ ని తీసుకెళ్ళమని చెప్పి పంపిస్తుంది. ఉదయం కార్ కవితకి ఇద్దామని చెప్పి అనుకోకుండా అరుణ్ కార్ డిక్కీ చూడగా.. అందులో అరుణ్ రాత్రి సేవ్ చేసిన అమ్మాయి శవం ఉంటుంది. ఆ అమ్మాయిని చంపిందెవరు? ఈ ఊహించని సంఘటన జరగడంతో అరుణ్, సోములు ఏం చేశారనేది మిగతా కథ.
విశ్లేషణ:
కన్నై నంబాత్ అంటే తెలుగులో 'కళ్ళని నమ్మొద్దు' అని అర్థం. ఈ సినిమా ఫస్ట్ నుండి చివరిదాకా ప్రతీ సీన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ని జోడిస్తూ చివరి వరకు ప్రేక్షకుడిని కూర్చోబెట్టాడు డైరెక్టర్. ఒక మర్డర్ ని కవర్ చేయడానికి మరొక యాక్సిడెంట్.. ఇలా ప్రతీ సీను ఒకదానికొకటి ఇంటర్ లింక్ అవుతుంటాయి. చివరివరకు హత్య చేసింది ఎవరనేది తెలియదు? అసలు ఆ హత్యల ఉద్దేశం ఏంటని చూపించిన విధానం అల్టిమేట్ అనే చెప్పాలి.
అరుణ్(ఉదయనిధి స్టాలిన్) సోము(ప్రసన్న) లు కలిసి ప్రథమార్ధంలో హత్య చేసిన కిల్లర్ ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నంతసేపు ఆసక్తిగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే ద్వితీయార్థం మొదలవుతుందో కథలో వచ్చే ట్విస్ట్ లు మాములుగా ఉండవు. అసలు ఊహించని ట్విస్ట్.. ఇదేనా ట్విస్ట్ అని అనుకునేలోపు మరొక ట్విస్ట్.. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమా మనం చూసేదంతా నిజంలాగే అనిపించినా కనపడని నిజాన్ని దాచేసిన తీరుని చూపిస్తుంది. అంటే మన కంటికి కనిపించేవాటి కంటే కూడా మనకు కనపడని నిజం.. అసలు జరిగిందేంటనేది చాలా స్పష్టంగా వివరిస్తూ ఒక్కో క్లూని బ్రేక్ చేస్తూ తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది.
అయితే సినిమాలో అరుణ్( స్టాలిన్) పాత్రకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. మూవీ ఓపెనింగ్ సీన్ తోనే కథలోకి వెళ్ళినా ఫస్టాఫ్ వరకూ సాగుతూనే ఉంటుంది. అడల్ట్ అండ్ బోల్డ్ సీన్స్ ఎక్కడా లేవు. సెకంఢాఫ్ ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది. తెలుగులో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. ప్రతీ సీన్ ఎంత పరిధి ఉండాలో అంతే ఉంచాడు. కానీ ఫస్టాఫ్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండు. బిజిఎమ్ సినిమాకి బలంగా నిలిచింది. జలంధర్ వాసన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు పనితీరు:
అరుణ్ పాత్రలో ఉదయనిధి స్టాలిన్ ఒదిగిపోయాడు. అరుణ్ కి రూమ్ మేట్ గా సోము పాత్రలో ప్రసన్న ఆకట్టుకున్నాడు. కళ్ళని నమ్మలేము అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చాడు సోము(ప్రసన్న). కవిత పాత్రలో భూమిక ముఖ్యపాత్రని పోషించింది. శ్రీరామ్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారంతా వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాని కామన్ ఆడియన్స్ ఒకసారి చూసేయొచ్చు. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్