English | Telugu

గందరగోళంలో పడిన ‘టాక్సిక్‌’.. అంతా యశ్‌ వల్లే జరిగింది!

2007లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ స్టార్‌ హీరో యశ్‌.. ఆ తర్వాతి సంవత్సరం చేసిన ‘రాకీ’ అతన్ని రాకీ భాయ్‌ని చేసింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వకపోయినా రాకీ భాయ్‌ అనే నేమ్‌ మాత్రం వచ్చింది. అయితే దాదాపు పదేళ్ళ తర్వాత ‘కెజిఎఫ్‌’ చిత్రంలోని రాకీ భాయ్‌ పేరుతోనే చాలా పాపులర్‌ అయిపోయాడు యశ్‌. ఈ పది సంవత్సరాల్లో 20 సినిమాల్లో నటించినా కెజిఎఫ్‌ మాత్రం అతన్ని స్టార్‌ హీరోని చేసింది. ఆ తర్వాత చేసి కెజిఎఫ్‌2 మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ‘టాక్సిక్‌’, ‘రామాయణ’ చిత్రాల్లో నటిస్తున్నాడు యశ్‌. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్‌’ ఇప్పుడు గందరగోళంలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం కూడా యశ్‌ అనే ప్రచారం జరుగుతోంది.

టాక్సిక్‌ చిత్రంతో యశ్‌ టెన్షన్‌ పడుతున్న మాట వాస్తవమేనని కన్నడ సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. గీతు మోహన్‌దాస్‌తో సినిమా చేయబోతున్నట్టు 2018లోనే ఎనౌన్స్‌ చేశాడు యశ్‌. స్క్రిప్ట్‌ వర్క్‌ అంతా పూర్తి చేసి 2024 జూన్‌లో లాంఛనంగా బెంగళూరులో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. అయితే ఆగస్ట్‌ 2024 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది. దాదాపు సంవత్సరంగా ఈ సినిమా జరుగుతున్నా ఇప్పటివరకు 60 శాతం మాత్రమే పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్‌లోనూ, నిర్మాణంలోనూ యశ్‌ భాగస్వామి కావడం విశేషం. మొదట ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఇప్పుడు బడ్జెట్‌ బాగా పెరిగింది. కన్నడ సినీ వర్గాల సమాచారం మేరకు 500 కోట్లు దాటిందని చెబుతున్నారు.

ఈ సినిమాను నిర్మాణపరమైన సమస్యలు గత కొంతకాలంగా వెంటాడుతున్నాయి. షెడ్యూల్స్‌ క్యాన్సిల్‌ కావడం, రీ షూట్‌లు, సినిమా పట్ల యూనిట్‌ కూడా అసంతృప్తిగా ఉండడం వంటి కారణాల వల్ల అందరికీ సినిమా పట్ల ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది. అందుకే షూటింగ్‌ కూడా స్లోమోషన్‌లో జరుగుతోంది. ఇన్ని సమస్యలు రావడానికి ముఖ్య కారణం హీరో యశ్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ సైడ్‌ పార్టిసిపేట్‌ చేస్తున్న యశ్‌.. డైరెక్షన్‌లో కూడా తలదూర్చినట్టు తెలుస్తోంది. ఒకరకంగా డైరెక్టర్‌ గీతూ మోహన్‌దాస్‌ని పక్కన పెట్టి తనే డైరెక్ట్‌ చేసేందుకు యశ్‌ ట్రై చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయం చెప్పడం కష్టతరంగా మారింది. కెజిఎఫ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యశ్‌ని ‘టాక్సిక్‌’ ఏం చేయబోతోంది అనే ఆందోళనలో అతని అభిమానులు కూడా ఉన్నారు.