English | Telugu
బండ జ్యోతి- తను బాధపడుతూ మనల్ని నవ్వించింది
Updated : Feb 27, 2016
జన్యువులే కారణమో, జీవనశైలే కారణమో... తను చాలా లావుగా ఉండేది. ఊబకాయం వల్ల శారీరికంగా చాలా ఇబ్బంది పడేది. కానీ అదే ఆసరాగా చేసుకుని ప్రేక్షకులని తెగ నవ్వించింది... ఆమే హాస్య నటి జ్యోతి! లెక్కకు మిక్కిలిగా సినిమాలలో, సీరియళ్లలో తన హావభావాలతో వీక్షకులకు చేరువైంది. జ్యోతి పట్నాయక్ కాస్తా బండ జ్యోతిగా పేరుపొందింది. సుదీర్ఘకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిన చూసుకుంటూనే ఆమె నానక్‌రాం గూడలోని చిత్రపురి కాలనీలో, తన అపార్టుమెంటులో తుదిశ్వాసను విడిచారు. తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకు, జీవనాన్ని ముందుకు సాగించేందుకు ఆమె చిన్నా పెద్దా వేషాలెన్నింటినో వేశారు.
అవకాశం వస్తే డబ్బింగ్ కూడా చెప్పేవారు. స్వయంవరం, భద్రాచలం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాలలో జ్యోతి నటనకు ప్రశంసలు లభించాయి. రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమాలోనూ ఒక చిన్న పాత్రను పోషించి మెప్పించారు. ఇక టీవీ ధారావాహికలతోనూ తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమే. అలనాటి భాగవతం సీరియల్ మొదలుకొని ఇంకా ప్రసారం అవుతున్న అమ్మనాకోడలా వరకూ ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగింటి ఆడపడుచులకు దగ్గరయ్యారు. వేసినవి చిన్నాచితకా పాత్రలే అయినా, వాటి నిడివి ఎంత తక్కువగా ఉన్నా... కాస్త పరిధిలోనే తనదైన శైలిలో, హావభావాలతో మెప్పించారు జ్యోతి.