English | Telugu

రెండు రోజుల్లో రిలీజ్‌.. ‘కన్నప్ప’కు మరో బిగ్‌షాక్‌.. ఆందోళనలో మంచు విష్ణు?

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ప్రారంభించిన నాటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రిలీజ్‌ దగ్గర పడుతున్న సమయంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి నిర్మాత కూడా మంచు విష్ణే కావడంతో అన్నింటినీ ఎదుర్కొని సినిమాని థియేటర్స్‌కి తీసుకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా ‘కన్నప్ప’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మాదాపూర్‌లోని మంచు విష్ణు కార్యాలయంపై ఐటి, జిఎస్‌టి అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అధికారులు కార్యాలయానికి వచ్చి సినిమా బడ్జెట్‌ గురించి ఆరా తీస్తున్నారు. అలాగే ఐటి, జిఎస్‌టికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘కన్నప్ప’ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న కొందరి ఇళ్ళపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరో రెండు రోజుల్లో ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో అధికారుల దాడులు చిత్ర యూనిట్‌ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే భారీగా సర్క్యులేట్‌ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, ఐటి దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.