English | Telugu

రవితోనే ఐబొమ్మను క్లోజ్‌ చేయించిన పోలీసులు.. ఈ అరెస్టుకు అతని భార్యే సూత్రధారి!

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్న పైరసీ మాఫియాకు తెరదించారు పోలీసులు. ముఖ్యంగా ఐబొమ్మ, బప్పం టీవీ టాలీవుడ్‌కి పెద్ద తలనొప్పిగా మారాయి. సినిమా రిలీజ్‌ అయిన కొద్ది గంటల్లోనై హెచ్‌డి క్వాలిటీ ప్రింట్‌ ఆయా వెబ్‌సైట్లలో దర్శనమిస్తుండడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడాల్సి వచ్చింది. ‘నన్ను పట్టుకోండి చూద్దాం’ అంటూ పోలీసులకు సవాల్‌ విసిరిన ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు.

పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాధ్యం కాని రవి అరెస్టు.. అతని భార్య సహకారంతో కుదిరింది. ఇప్పుడీ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. విదేశాల్లో ఉంటున్న రవికి, అతని భార్యకు కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే విడాకులు తీసుకునే విషయంలో చర్చించడానికి రవి హైదరాబాద్‌కి వస్తున్న సమాచారాన్ని ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేరవేసింది. దీంతో పోలీసులు అతని కోసం కాపుకాసి అరెస్ట్‌ చేశారు. ఆమె ఇచ్చిన టైమ్‌ లైన్‌, లొకేషన్‌ వివరాల ఆధారంగా రవిని ట్రాక్‌ చేసి కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్‌ నుంచి అర్థరాత్రి హైదరాబాద్‌కి చేరుకున్న రవి.. పోలీసుల వలలో పడ్డాడు.

రవిని అరెస్ట్‌ చేయడంతోపాటు కొన్నేళ్లుగా అతను నిర్వహిస్తున్న పైరసీ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిలిపివేయడంలో పోలీసులు విజయం సాధించారు. తన దగ్గర కోట్ల మంది డేటా ఉందని రవి గతంలో పోలీసులను బెదిరించిన విషయం తెలిసిందే. రవి అరెస్ట్‌ తర్వాత అతనికి సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, వెబ్‌ లాగిన్‌లు, సర్వర్‌ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని సమక్షంలో, అతనితోనే ఐబొమ్మ, బెప్పం టీవీలను క్లోజ్‌ చేయించారు. విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్న వీటిని డీయాక్టివేట్‌ చేయడంలో పోలీసులు రవి సహకారం తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం పోలీసులు రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌డిస్క్‌లను పరిశీలనకు పంపారు. అలాగే ఇప్పటివరకు అతను సంపాదించిన అక్రమ ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాదు, అతని ఎకౌంట్ల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రవి నుంచి మరింత సమాచారాన్ని సేకరించేందుకు కస్టడీకి తీసుకోవాలని సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.