English | Telugu

Anantha Review: పుట్టపర్తి సత్యసాయి బాబా 'అనంత' మూవీ రివ్యూ

తారాగణం: జగపతిబాబు, సుహాసిని, వై.జి.మహేంద్రన్, తలైవాసల్ విజయ్ తదితరులు
సంగీతం: తేనిసాయి తెంద్రల్ దేవా
డీఓపీ: సంజయ్
ఎడిటర్: రిచర్డ్
రచన, దర్శకత్వం: సురేష్ కృష్ణ
బ్యానర్: ఇన్నర్ వ్యూ
ఓటీటీ: జియో హాట్ స్టార్

పుట్టపర్తి సత్యసాయి బాబా మహిమల ఆధారంగా తెరకెక్కిన చిత్రం అనంత. జగపతిబాబు, సుహాసిని కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బాషా ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా రూపొందించిన 'అనంత' చిత్రం తాజాగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే..? (Anantha Movie Review)

కథ:
ముంబైకు చెందిన వర్ధన్ రావు(జగపతిబాబు), కేరళకు చెందిన మహదేవన్(వై.జి.మహేంద్రన్), చెన్నైకు చెందిన మీనాక్షి, కాశీకి చెందిన అన్నపూర్ణ(సుహాసిని), కలకత్తాకు చెందిన జాన్.. ఈ ఐదుగురు సత్యసాయిబాబా భక్తులు. లక్షలాది భక్తులుండగా ఈ ఐదుగురిని పుట్టపర్తికి రమ్మని ప్రత్యేక ఆహ్వానం అందుతుంది. ఈ ఐదుగురు ఎందుకంత ప్రత్యేకం? వీరి కథలేంటి? అసలు వారు సత్యసాయి భక్తులుగా ఎలా మారారు? సత్యసాయి మహిమలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
వాస్తవ వ్యక్తులు, వాస్తవ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జోడించి ఓ భక్తి చిత్రం రూపొందించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అలాంటి సాహసమే ఈ చిత్ర బృందం చేసింది.

ఇది ఐదు కథల సమాహారంగా తెరకెక్కింది. విభిన్న ప్రాంతాలు, విభిన్న రంగాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు.. సత్యసాయి బాబాకు భక్తులుగా ఎలా మారారు? వారి జీవితాలపై సత్యసాయి ఎలాంటి ప్రభావాన్ని చూపారు? అనేది ఈ సినిమాలో చూపించారు.

సత్యసాయి భక్తులకు నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది బోర్ కొట్టించవచ్చు, డాక్యుమెంటరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించే అవకాశముంది.

పుట్టపర్తిలో సత్యసాయి ఆశ్రమం, అక్కడి భక్తులను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐదుగురు ప్రత్యేక భక్తుల పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయమవుతాయి. ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. అయితే ఐదుగురు భక్తుల పాత్రలు పరిచయమయ్యాక.. అసలు వారు ఎవరు? బాబాకు వారు ఎందుకంత ప్రత్యేకం? అనే ఆసక్తిని కలిగిస్తూ సినిమా నడుస్తుంది.

ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ వర్ధన్ రావుగా జగపతిబాబు కనిపించాడు. ఆ పాత్రను ఆయన సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ సత్యసాయి మహిమను తెలుపుతూ వర్ధన్ రావు పాత్ర చుట్టూ రాసుకున్న సన్నివేశాలు కొన్ని సహజత్వానికి దూరంగా ఉన్నాయి.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక బిడ్డకు తల్లిగా అన్నపూర్ణ పాత్రలో సుహాసిని నటించింది. ఈ ట్రాక్ లో తల్లీకొడుకుల మధ్య మంచి ఎమోషన్ ఉంది. డాక్టర్ గా సత్యసాయి వచ్చి బిడ్డను కాపాడటం బాగుంది. అయితే ఈ ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది.

అలాగే అనారోగ్యంతో భార్యను దూరం చేసుకున్న భర్త, కాలికి దెబ్బ తగిలి నాట్యం చేయలేక ఇబ్బందిపడే నృత్యకారిణి, ఆపదలో చిక్కుకున్న వ్యక్తి ఇలా విభిన్న కథల సమాహారంగా ఇది తెరకెక్కింది.

ఇలా ఐదుగురు భక్తుల కథల ద్వారా సత్యసాయి మహిమల గురించి చెప్పాలన్న ఆలోచన బాగుంది. అయితే రచన ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషీయల్ గా అనిపిస్తే, మరికొన్ని ల్యాగ్ అనిపిస్తాయి. ఎమోషన్ ని విజువల్ గా చెప్పడం కంటే.. మాటల రూపంలోనే ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించారు. కొన్ని సీన్స్ లో పేజీల పేజీల డైలాగ్స్ ఆర్టిస్టుల చేత చెప్పించడం.. సినిమా ఫ్లోకి బ్రేకులు వేసింది.

సాధారణ ప్రేక్షకులకు ఎలా ఉన్నా.. సత్యసాయి భక్తులకు ఈ చిత్రం నచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొన్ని సత్యసాయి రియల్ విజువల్స్ చూపించడం.. భక్తులను మంచి అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

దర్శకుడిగా సురేష్ కృష్ణ తన స్థాయిలో కాకపోయినా.. ఉన్న వనరులతో పరవాలేదు అనిపించుకున్నాడు. తేనిసాయి తెంద్రల్ దేవా సంగీతం డివోషనల్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సంజయ్ కెమెరా పనితనం బాగానే ఉంది. రిచర్డ్ ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. సీన్స్ నిడివి ఎక్కువైపోయింది. చాలా షాట్స్ ని షార్ప్ గా కట్ చేయలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా..
సత్యసాయిబాబా భక్తులకు నచ్చే చిత్రం.

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.