English | Telugu

హాసినికి టాలీవుడ్‌పై గాలి మళ్లిందట.. రీ ఎంట్రీకి రెడీ అంటున్న హీరోయిన్‌!

టాలీవుడ్‌లో లాంగ్‌ కెరీర్‌ ఉన్న హీరోయిన్లు తక్కువనే చెప్పాలి. కొన్ని సంవత్సరాలు హీరోయిన్‌గా కొనసాగి అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్ళి చేసుకొని కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఎక్కువ శాతం హీరోయిన్లు ఇదే పద్ధతిలో వెళ్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్‌ టాలీవుడ్‌లో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌పై 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన జెనీలియా ఆ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌ వెళ్ళిపోయి అక్కడ ‘తుజె మేరీ కసమ్‌’ అనే సినిమాలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత శంకర్‌ ‘బాయ్స్‌’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సౌత్‌కి వచ్చింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తేవడంతో తెలుగులో ‘సత్యం’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 30 సినిమాల్లో నటించింది. హ్యాపీ, సై, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్‌ చిత్రాలు ఆమెకు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చాయి. 2012 ఫిబ్రవరిలో తన ప్రియుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకుంది. పెళ్లి తర్వాత రిలీజ్‌ అయిన ‘నా ఇష్టం’ తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం.

పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్‌బై చెప్పలేదు. బాలీవుడ్‌లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉంది. అందులో కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. తనకు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చిన టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది జెనీలియా. హిందీలో భర్తతో కలిసి హీరోయిన్‌గా నటిస్తున్న జెనీలియా టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గానే నటిస్తుందా లేక అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో తనకు నటించాలని ఉందని, మంచి క్యారెక్టర్లు వస్తే తప్పకుండా చేస్తానని ఇటీవల ప్రకటించింది.