English | Telugu
రవితేజ బర్త్ డే స్పెషల్ స్టొరీ
Updated : Jan 26, 2016
మాస్ మహారాజా రవితేజ. ఈ పేరు హుషారుకు మారుపేరు. ఆయన సినిమా పైసా వసూల్. మాస్ జనాలకు ఫుల్ మీల్. కష్టపడితే ఫలితం దక్కితీరుతుందనే మాటకు ఆయన కరెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు (26.01.2016) రవితేజ పుట్టిన రోజు.90వ దశకంలో సినీ కెరీర్లోకి అడుగుపెట్టి,అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రవితేజ, ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు.ఎన్ని కష్టాలు పడినా,తనకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ ను వదులుకోకూడదనుకునే దృఢసంకల్పమే,ఆయన చేత సక్సెస్ ను టేస్ట్ చేయించింది.
సైడ్ క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి తక్కువ మందిలో రవితేజ ఒకరు. హీరోగా తానేంటో ఆయన ఎప్పుడో నిరుపించుకున్నారు. ఆయన హుషారు,ఎనర్జీ ముందు కుర్రహీరోలు కూడా బలాదూర్ అంటే ఆశ్చర్యం లేదేమో.మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే రవితేజ,అచ్చం ఆయనలాగే సైడ్ క్యారెక్టర్లతో మొదలుపెట్టి, అగ్రకథానాయకుడిగా ఎదగడం విశేషం.
తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట లో 1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. చిన్నతనం నుంచీ ఆయనకు సినిమాలంటే ప్రాణం.ఆ ఇష్టమే ఆయన్ను రైలెక్కి మద్రాస్ చేరుకునేలా చేసింది..అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం' సినిమాలో ముఖ్య పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'నీ కోసం' తో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో రవితేజ నటనకు ప్రశంసలతో పాటు అవార్డు కూడా వరించింది. తర్వాత పూరి డైరెక్టన్లో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' తో పడిన పునాదిరాయి, ఇడియట్ తో ధృఢపడింది.వరస హిట్స్ తో ఇండస్ట్రీలో తన ముద్రను వేసి,తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారాయన. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేది దర్శకనిర్మాతల ధీమా.అందుకే ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడుతుంటారు.ప్రస్తుతం,ఆయన వేణు శ్రీరామ్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న 'ఎవడో ఒకడు' చేస్తున్నారు .
హిట్లు ఫ్లాపుల గురించి రవితేజ ఆలోచించరు.తన ప్రయత్నాన్ని మాత్రం వంద శాతం పెట్టి కష్టపడతారు..'ఫ్లాప్ అయితే ఏడుస్తూ కూర్చోను,హిట్ అయితే పార్టీ చేసుకోను' అంటూ ఫలితాలకు అతీతంగా,తను ఆచరించే కర్మసిద్ధాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పడం రవితేజకే చెల్లింది..ఈ మాస్ మహారాజా భవిష్యత్తులో, ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని,మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం..ఎ వెరీ హ్యాపీ బర్త్ డే టు 'మాస్ మహారాజా రవితేజ '.