English | Telugu

హ్యాపీడేస్ మళ్లీ తీసేశారా??

కాలేజీ స్నేహాలూ, కుర్రాళ్ల చిలిపి చేష్ట‌లూ, ప్రేమ‌లూ, అందులో ఈగో స‌మ‌స్య‌లూ.. వాటితో అల్లుకొన్న అంద‌మైన సినిమా.. హ్యాపీడేస్‌. శేఖ‌ర్ క‌మ్ముల మార్క్ నూటికి నూరుపాళ్లు ఆవిష్క‌రించిన సినిమా ఇది. హ్యాపీడేస్ పుణ్య‌మా అని కాలేజీ క‌థ‌లు మ‌ళ్లీ జోరందుకొన్నాయి. అప్ప‌ట్లో కుప్ప‌లుతెప్ప‌లుగా వ‌చ్చిప‌డ్డాయి. వాటికి బ్రేక్ వ‌చ్చింది. కాలేజీ క‌థ‌ల‌కు, హ్యాపీడేస్ త‌ర‌హా క‌థాంశాల‌కూ బ్రేక్ ప‌డింది. అయితే ఇప్పుడు దిల్‌రాజు తీసిన కేరింత చూస్తే... హ్యాపీడేస్‌ని మ‌ళ్లీ తీసేశారేమో అనిపిస్తోంది. ఈ సినిమా గీతాలూ, ప్ర‌చార చిత్రాలూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో కేరింత అనే టైటిల్ సాంగ్ చూస్తుంటే.. హ్యాపీడేస్‌కి కాపీ పేస్ట్‌లా అనిపిస్తోంది. మూడు జంట‌ల మ‌ధ్య జ‌రిగే ఈ క‌థ‌.. హ్యాపీడేస్ ఫార్మెట్లోనే సాగిపోయే సూచ‌న‌లు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. సాయికిర‌ణ్ అడ‌వి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. దిల్‌రాజుకి హ్యాపీడేస్ లాంటి సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో ఉంది. ఆ కోరిక ఈ విధంగా తీర్చుకొన్న‌ట్టున్నాడు. ఈ సినిమా మొద‌లై.. ఏడాది దాటేసింది. స్లో.. అండ్ స్ట‌డీగా తీస్తున్న ఈ సినిమా హ్యాపీడేస్ స్థాయి విజ‌యాన్ని అందుకొంటుందా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.