English | Telugu

ఆంధ్రా కింగ్‌ని వెనక్కి నెట్టిన ధనుష్‌.. రామ్‌ పరిస్థితి ఏంటి?

ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత వరస పరాజయాలతో ఉన్న రామ్‌ పోతినేని.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రంపైనే హోప్స్‌ పెట్టుకున్నాడు. మహేష్‌బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 27న విడుదలైంది. చాలా కాలం తర్వాత రామ్‌ సినిమాకి మొదటి రోజు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఓపెనింగ్స్‌ భారీగా లేకపోయినా పికప్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సినిమాకి వచ్చిన రిజల్ట్‌ని బట్టి అర్థమైంది. స్లోగా టాక్‌ స్ప్రెడ్‌ అయి మంచి సినిమాగా నిలబడుతుందని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. అయితే మరుసటిరోజు విడుదలైన ధనుష్‌ సినిమా రామ్‌ ఆశలను నీరుగార్చేలా కనిపిస్తోంది.

ధనుష్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రాంజానా’ చిత్రం 2013లో విడుదలై సూపర్‌హిట్‌ అయింది. 36 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 105 కోట్లు కలెక్ట్‌ చేసింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ‘రాంజానా’ చిత్రానికి సీక్వెల్‌గా ‘తేరే ఇష్క్‌ మే’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో ధనుష్‌, కృతి సనన్‌ జంటగా నటించారు. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 27న రిలీజ్‌ కాగా, ‘తేరే ఇష్క్‌ మే’ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ నవంబర్‌ 28న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ సాధించింది.

‘అమరకావ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ‘తేరే ఇష్క్‌మే’ చిత్రం.. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రానికి గట్టి పోటీ ఇస్తున్నట్టు కలెక్షన్స్‌ చెబుతున్నాయి. ఈవారం ప్రధానంగా ధనుష్‌, రామ్‌ మధ్య పోటీ నెలకొంది. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో 141 షోలు పడగా, అందులో 46 మాత్రమే ఫుల్స్‌ అయ్యాయి. ‘అమరకావ్యం’ డబ్బింగ్‌ సినిమా కావడంతో కేవలం 106 షోలు మాత్రమే వేశారు. అయితే అందులో 50 షోలు ఫుల్స్‌ కావడం సినిమాకి ఉన్న స్టామినాను తెలియజేస్తోంది. వరస పరాజయాలతో ఉన్న రామ్‌కి ఆశాదీపంలా కనిపించిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రానికి మంచి టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ‘అమరకావ్యం’ కంటే వెనకబడి ఉండడం దర్శకనిర్మాతలను కలవరపెడుతోంది. ఈ రెండు సినిమాలు జోనర్స్‌ వేరు కాబట్టి ఏ సినిమాకి లభించే ఆదరణ ఆ సినిమాకి లభిస్తుందని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఈ రెండు సినిమాల నిర్మాతలు హ్యాపీ అవుతారు. ముఖ్యంగా రామ్‌ ఈ సినిమాతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.