English | Telugu

పూరి జ‌గ‌న్నాథ్‌లో ఉన్న న‌టుడ్ని చూసి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు!

 

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'గాడ్‌ఫాద‌ర్' మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. మోహ‌న్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు చేయ‌గా, స‌ల్మాన్ ఖాన్ ఓ స్పెష‌ల్ రోల్‌, జ‌ర్న‌లిస్ట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్‌పై మేక‌ర్స్‌తో పాటు చిరంజీవి కూడా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా యాంక‌ర్ శ్రీ‌ముఖికి విమానంలో ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.

'గాడ్‌ఫాద‌ర్‌'లో చిరంజీవికి హీరోయిన్ లేదు. అలాగే సాంగ్స్ కూడా లేవు. వీటిపై స్పందిస్తూ, "హీరోయిన్ లేదేంటి అన్న‌ కానీ, సాంగ్స్ లేవేంటి అన్న కానీ.. అస‌లు అలాంటి ఆలోచ‌న అనేది రాకుండా చేసే స‌బ్జెక్ట్ గాడ్‌ఫాద‌ర్‌." అని చెప్పారు చిరు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఒక సౌత్ సినిమాలో న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఇటీవ‌ల వ‌చ్చిన ట్రైల‌ర్‌లో ఓ సంద‌ర్భంలో స‌ల్మాన్ ఖాన్‌తో "వెయిట్ ఫ‌ర్ మై క‌మాండ్ బ్ర‌ద‌ర్ అనే డైలాగ్" చెప్తారు చిరంజీవి. స‌ల్మాన్ ఈ సినిమాలో న‌టించ‌డంపై స్పందిస్తూ, "త‌ను కేవ‌లం ప్రేమ‌తోటి ఈ సినిమా చేశాడు క‌నుక‌.. హ్యాట్సాఫ్ టు స‌ల్మాన్ భాయ్.. వియ్ ల‌వ్ యు" అని గాల్లోనే ముద్దు పెట్టారు. 

జ‌ర్న‌లిస్ట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ న‌టించ‌డంపై శ్రీ‌ముఖి ప్ర‌శ్నించ‌గా, "సార్‌.. నేను చ‌స్తే చెయ్య‌ను సార్ అన్నాడు. అత‌నిలో క‌మాండింగ్ ఉన్న న‌టుడు ఉన్నాడ‌ని మీరే ఆశ్చ‌ర్య‌పోతారు" అని చెప్పారు చిరు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌ను అయితే ఆకాశానికి ఎత్తేశారు. "ఈ సినిమాకి ఆరో ప్రాణ‌మై, బియాండ్ హండ్రెడ్ ప‌ర్సెంట్ తీసుకెళ్లిన వ్య‌క్తి త‌మ‌న్‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే 'గాడ్‌ఫాద‌ర్' నిశ్శ‌బ్ద విస్ఫోట‌నం" అన్నారు.

సెన్సార్ ప‌నులు పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికెట్ పొందిన ఈ మూవీని ఆర్‌.బి. చౌద‌రి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. నయ‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు చేశారు. మోహ‌న్‌లాల్ న‌టించ‌గా మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన 'లూసిఫ‌ర్‌'కు ఇది రీమేక్‌. సంద‌ర్భ‌వ‌శాత్తూ లూసిఫ‌ర్ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఇదివ‌ర‌కే థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే అది స‌రిగా ఆడ‌లేదు.