English | Telugu
చిరుకి పవనే దిక్కు
Updated : Jan 6, 2015
చిరంజీవి - పవన్ కల్యాణ్... వీరిద్దరి మధ్య దూరం పెరుగుతోంది. దాన్ని అభిమానులూ గమనిస్తూనే ఉన్నారు. ఇది వరకు మెగా ఫ్యాన్స్‌గా ఉండేవాళ్లు... ఇప్పుడు మెగాఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ విడిపోయారు. అన్నయ్య హాజరయ్యే వేడుకలకు తమ్ముడు డుమ్మా కొట్టడం... ఫ్యాన్స్ పవన్ పవన్.. అంటూ కలవరించినా చిరు ఎలాంటి సమాధానం చెప్పకపోవడం... ఇవన్నీ మన కళ్లముందు రీళ్లుగా కదులుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో మొదలైన చిరు డౌన్ ఫాల్.. రెండు రాష్ట్ర్రాల్లోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతో పరిపూర్ణమైంది. పవన్‌తో పోలిస్తే చిరు క్రేజ్ అంతంత మాత్రమే. మరోవైపు పవన్ కల్యాణ్ అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ శక్తిగా ఎదురుతున్నాడు. పవన్ మద్దతు ఇచ్చిన టీడీపీ, బీజేపీలు అధికారంలో కొనసాగుతున్నాయి. ఈ దశలో చిరు తమ్ముడికి దగ్గరై... తద్వారా బీజేపీలోకి చేరి.. రాజకీయంగా సేఫ్ పొజీషన్‌లో ఉండడానికి ప్రయత్నిస్తాడని రాజకీయ, సినీ విశ్లేషకులు... చిరు మనస్తత్వం గురించి తెలిసినవాళ్లు చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అవుతోంది. పవన్ కల్యాణే.. చిరుకి దగ్గరై అన్నయ్యని కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత భుజాలపై వేసుకొన్నాడా అనిపిస్తోంది.
గోపాల గోపాల ఆడియో ఫంక్షన్లో పవన్ మాట తీరు ఇందుకు అద్దం పడుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా అన్నయ్యని స్తుతించడం మొదలెట్టాడు. అసలు అన్నయ్య లేకపోతే సినిమాల్లో ఉండాలి, ఇక్కడ రాణించాలన్న తలపే రాకపోయుండేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అన్నయ్య మాటల్ని మర్చిపోలేను.. అంటూ తామిద్దరం ఒక్కటే అనే సంకేతాల్ని అభిమానులకు పంపాడు పవన్ కల్యాణ్. చిరంజీవి పాల్గొన్న ఏ మెగా కార్యక్రమాన్నయినా తీసుకోండి. అక్కడ పవన్ ప్రస్తావన రాదు. రాకూడదు... ఇది చిరంజీవి రూల్ అట. అభిమానులు `పవన్ పవన్` అని గోల చేస్తే తప్ప... తమ్ముడు గురించి ప్రస్తావించడు చిరు. కానీ పవన్ కావాలని గోపాల గోపాల ఫంక్షన్లో అన్నయ్య పేరు ప్రస్తావించాడన్న విషయం కాస్త కామన్‌సెన్స్ ఉన్నవాళ్లెవరికైనా అర్థమవుతోంది. అన్నయ్య ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు. రాజకీయంగా ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఇక సినిమాల సంగతి సరే సరి. 150వ సినిమా చేయాలా, వద్దా అనేది ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు. ఈ దశలో అన్నయ్యకు అండగా ఉండాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
ఏమాటకామాట చెప్పుకోవాలి.. ఇప్పుడు పవన్ స్టార్‌డమ్ వెనుక, విజయాల వెనుక, అభిమానుల వెనుక ఉన్నది చిరునే. పవన్ ఉన్నతికి బీజాలు వేసింది చిరంజీవే. అందుకే ఆ రుణం పవన్ ఇలా తీర్చుకోబోతున్నాడన్నమాట. మరి ఇప్పటికైనా అన్నాదమ్ముళ్లు ఒక్కటవుతారో, లేదంటే ఇలా వేర్వేరు వేదికలపై మాటలతోనే సరిపెట్టుకొంటారో చూడాలి. ఎనీవే... బంతి ఇప్పుడు చిరు కోర్టులో ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో. ఇద్దరూ కలసి జనసేన కోసం పనిచేస్తారా, లేదంటే బీజేపీ తీర్థం పుచ్చుకొంటారా..? లేదంటే వేర్వేరుగా ఉంటూనే ఎవరి ఉనికిని వాళ్లు కాపాడుకొంటారా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. చూద్దాం.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.