English | Telugu
పవన్ కళ్యాణ్ లో ఓ బాబా ఉన్నాడండోయ్!
Updated : Jan 5, 2015
నావెనుక ఎంత మందున్నా నేను భగవంతుడిముందూ, ఈ సృష్టి ముందూ మోకరిల్లుతాను
ఎన్ని విజయాలొచ్చినా.. భగవంతుడి దారి మాత్రం వదలను.
నేను భయపడేది ఒక్క భగవంతుడికే.
నా చేతిలో ఏం లేదు... కృషి, కష్టం తప్ప!
ఈ ప్రపంచం నాది కాదనిపిస్తోంది. నాకూ, ఈ ప్రపంచానికి సంబంధం లేదనిపిస్తోంది!
ఈ మాటలు వింటుంటే ఓ బాబానో ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నట్టు అనిపిస్తుంది కదూ. ఆ బాబా.. పవన్ బాబా! తెలుగు నాట ఓ సూపర్ స్టార్. పారితోషికం తీసుకోవడంలో తిరుగులేని హీరో. బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన వీరుడు. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకొన్న.. రొమాంటిక్ వ్యక్తి. ఇలాంటి మాటలు మాట్లాడతాడని, అతనిలో ఇంత లోతైన ఆధ్యాత్మికత ఉంటుందని ఎవరూ ఊహించరు.
పవన్ చాలా సింపులగా ఉంటాడు. అంతే సింపుల్ గా మాట్లాడతాడు. లోపల ఉన్నది ఉన్నట్టుగానే బయటకు చెప్పేస్తాడు. గోపాల గోపాల ఆడియో వేడుకలోనూ అదే జరిగింది. మరోసారి పవన్ తన సింప్లిసిటీని ఆవిష్కరించుకొన్నాడు. పవన్ ఫ్యాన్స్కి సరికొత్త సంగతులు బోధించాడు. జయాపజయాలు తన చేతుల్లో లేవని.. అయినా తాను కష్టపడతానని, ఈ ప్రపంచానికి భయపడి పారిపోనని, ఇక్కడే సాధించి తీరుతానని ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు పవన్.
తన పరాజయాల్నీ కుండ బద్దలు కొట్టినట్టు ఒప్పుకొన్నాడు. ఖుషీ తరవాత తనకు గడ్డు రోజులు రాబోతున్నాయని, పరాజయాలు ఎదుర్కోబోతున్నానని పవన్ కి ముందే తెలిసిందట. తన బ్యాడ్ పిరియడ్ గురించి ముందే సంకేతాలు అందేశాయట. `ఒక్క హిట్టు కొట్టన్నా.. ఒక్క హిట్టు కొట్టన్నా..` అని అభిమానులు గుండెలు బాదుకొంటుంటే తొలిసారి దేవుడ్ని `దేవుడా ఓ హిట్టివ్వు.... ఈ ఇండ్రస్ట్రీ నుంచి వెళ్లిపోతా..` అని మొరపెట్టుకొన్నాడట పవన్. ఇవన్నీ అక్షరాలా పవన్ పలికిన పలుకులు.
తనది ఆధ్మాత్మిక బాట అని, దేవుడు మీద తనకు భయభక్తులు కలిగున్నాయని తన ప్రతి మాటలోనూ నొక్కివక్కాణించాడు పవన్ కల్యాణ్. ధవళ వస్త్రాలతో వేడుకకు వచ్చిన పవన్... అంతే స్వచ్ఛంగా మాట్లాడి అభిమానుల్ని మెప్పించాడు. పవన్లో ఓ కొత్త కోణం గోపాల గోపాల ఆడియో ఫంక్షన్లో ఆవిష్కృతమైంది. పవన్ పలుకులు, అతని భావాలూ అభిమానులు పూర్తిగా కొత్తగా అనిపించాయి. ఓ స్టార్ మాట్లాడుతున్నట్టు కాదు... ఓ బాబా పలుకులు విన్నట్టు సంబరపడ్డారు. ఎనీహౌ.. పవన్ తనని దేవుడిలా కొలిచే అభిమానుల ముందు ఓ ఆధ్యాత్మిక ప్రసంగం చేసేశాడు. అందరినీ మెప్పించాడు. ఇక దేవుడిగా (గోపాల గోపాలలో పవన్ దేవుడే) వెండి తెరపై ఇంకెన్ని లీలలు చూపిస్తాడో మరి..! వెయిట్ అండ్ సీ.