English | Telugu

చిన్నదాన నీకోసం రివ్యూ...

2014లో అబ్బో.... అనే అద్భుతాలు చూసుంటారు..
అబ్బా.. అని త‌ల బాదుకొనే సినిమాలూ త‌గిలాయి.
ఫినిషింగ్ ట‌చ్‌.. మాత్రం బెంబేలెత్తిపోయేలా చేశాడు నితిన్‌. చిన్న‌దానా నీ కోసం సినిమాతో!
2014కి ఇంత దారుణ‌మైన ఎండింగ్ ఎవ్వ‌రూ ఊహించుండ‌రు..!
ఎందుకంటే నితిన్ ఫామ్‌లో ఉన్నాడు. క‌నీసం ఈ సినిమాతో అయినా నిరూపించుకోవాల్సిన బాధ్య‌త క‌రుణాక‌ర‌న్ పై ఉంది. అనూప్‌, ఆండ్రూలాంటి సాంకేతిక నిపుణుల అండ దండ‌లున్నాయి. సో... చిన్న‌దానా నీ కోసంలో ఎంతో కొంత మేట‌ర్ ఉండే ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసుంటారు జ‌నాలు. వాటిని ఏమాత్రం అందుకోలేక‌, ఆద్యంతం నీర‌సంగా నిరుత్సాహంగా సాగిందీ సినిమా. ఆ విధంబెట్టిద‌నిన‌...

నితిన్ (నితిన్) అల్ల‌రి కుర్రాడు. బాధ్య‌త‌ల మాటేమోగానీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ అమ్మాయిని ర‌క్షించి రెడ్డి(నాజర్) దృష్టిలో ప‌డ‌తాడు. రెడ్డి కి నితిన్ ప‌ట్ల మ‌మ‌కారం పెరుగుతుంది. నందిని(మిష్తి చక్రవ‌ర్తి)ని చూసీ చూడ‌గానే ప్రేమ‌లో ప‌డిపోతాడు నితిన్‌. నందిని ఓ డాన్స్ క్లాస్ కండెక్ట్ చేస్తుంటుంది. అందుకు రెడ్డిగారి ఇల్లు కావాల్సొస్తుంది. నందిని అడిగితే రెడ్డి నో చెబుతాడు. అందుకే నితిన్‌ని అడ్డు పెట్టుకొని ఆ ఇంటిలోకి ఎంట్రీ ఇస్తుంది. నితిన్ పెట్టిన కండీష‌న్ల కోసం రెండు మూడు సార్లు నితిన్ ఇంటికి వ‌స్తుంది. నితిన్ ల‌వ‌ర్‌లా న‌టిస్తుంది. ఆ న‌ట‌న‌కే నితిన్ ఇంట్లోవాళ్లంతా ప‌డిపోతారు. ఓ రోజు స‌డ‌న్‌గా రెడ్డిని తీసుకొని యూర‌ప్ వెళ్లిపోతుంది నందిని.
అస‌లు నందిని రెడ్డిగారిని క‌ల‌వ‌డం వెనుక, ప‌రిచ‌యం పెంచుకోవ‌డం వెనుక ఓ ర‌హ‌స్యం ఉంటుంది. దాన్ని నితిన్ బ‌య‌ట‌పెడ‌తాడు. నందినిని వెతుక్కొంటూ నితిన్ యూర‌ప్ వెళ్తాడు. అస‌లు నందిని ఎవ‌రు? రెడ్డికి, నందినికి ఉన్న సంబంధం ఏమిటి.? యూర‌ప్ వెళ్లిన నితిన్ అక్క‌డ ఏం చేశాడు? ఈ విష‌యాల‌న్నీ తెలుసుకోవాలంటే చిన్న‌దాన నీ కోసం సినిమా చూడాలి.

అత్తారింటికి దారేది సినిమాని కాస్త రివ‌ర్స్ చేసుకొని రాసుకొంటే ఈ క‌థ త‌యారైందేమో అనిపిస్తుంది. తాత‌య్య కోసం మ‌న‌వ‌రాలు ఫారెన్ నుంచి ఇండియా వ‌చ్చి, ఇక్క‌డో నాట‌కం ఆడి, తాత‌య్య‌ని త‌న‌తో పాటు తీసుకెళ్లిపోవ‌డం ఈ క‌థ‌. మ‌రి ఇలాంటి సాదా సీదా క‌థ‌ని నితిన్ ఎలా నమ్మాడో, వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న క‌రుణాక‌ర‌న్ చేతికి ఎలా అప్ప‌గించాడో అర్థం కావడం లేదు. సినిమా మొద‌లైన తొలి ప‌ది నిమిషాల్లోనే `ఏదో ఘోర‌మైన సినిమా చూస్తున్నాం` అన్న పీలింగ్ వ‌చ్చేసిందంటే అర్థం చేసుకోవ‌చ్చు.. ఈ సినిమా ప‌రిస్థితి ఏమిటో..?? క‌నీసం ఒక్క‌టంటే ఒక్క సీన్‌లోనూ క‌నెక్ట్ అవ్వం. ప్రేమ‌క‌థ‌ల్లో హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, పాట‌లు, వాళ్ల‌మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు, ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుచుకోవ‌డాలూ ఇలాంటివి చాలా కీల‌కం. ఇవెంత పండితే సినిమా అంత హిట్టు. నితిన్‌కీ ఈ సంగ‌తి తెలుసు. కానీ ఇందులో ఏ ఒక్క విభాగం కూడా చిన్న‌దానా నీకోసం లో పండ‌లేదు. తొలిప్రేమ తీసిన క‌రుణాక‌ర‌నేనా అనిపించింది కొన్నిసార్లు. హ్యాపీ, యువ‌కుడు సినిమాలు అంత‌గా ఆడ‌లేదు. కానీ ఇప్పుడు చూసినా బాగుంటాయి. ఆద్యంతం ఫ‌న్ కంటిన్యు అవుతుంటుంది. ఇందులో బ‌ల‌వంతంగా తెచ్చిపెట్టుకొన్న కామెడీ త‌ప్ప మ‌రోటి క‌నిపించ‌దు. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ లేక‌పోతే... ఇదెంత సాదా సీదా క‌థో అనిపిస్తుంది. ట్విస్ట్‌ని రివీల్ చేసిన విధానం కూడా బాలేదు. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ప‌ది నిమిషాల‌కే క‌థాగ‌మ‌నం అర్థ‌మైపోతుంది. అక్క‌డి నుంచి ఏం చేయాలో తెలీక గే కామెడీ సృష్టించి, హీరోయిన్‌నే కాసేపు విల‌న్ గా మార్చి... నానా యాగీ చేశాడు.

ప‌వ‌న్‌. ప‌వ‌న్‌.. ప‌వ‌న్‌.. ఇదే నితిన్ నామ జ‌పం అయిపోయింది. ఎంత ప‌వ‌న్ ఫ్యాన్ అయితే మాత్రం మ‌రీ ఇంత డ‌బ్బా ప‌నికి రాదు. రెండు మూడు చోట్ల ప‌వ‌న్ పేరు ప్ర‌స్తావించాడు. ఓ పాట‌లో అయితే ప‌వ‌న్‌నే చూపించేశాడు. బ‌ద్రిలో చికిత పాట‌లోని కొన్ని బిట్స్ వాడుకొన్నాడు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కొంత వ‌ర‌కూ న‌చ్చొచ్చు గాక‌. మ‌రి మిగిలిన‌వాళ్ల ప‌రిస్థితేంటి?? ఈ గోల మాకెందుకు?? అనుకోరూ. కేవ‌లం ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసమే నితిన్ సినిమాలు చేస్తున్నాడా..?? ఈ ధోర‌ణి నుంచి నితిన్ ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డితే అంత మంచిది.

సినిమాలో హీరో, హీరోయిన్ త‌ప్పితే నాజ‌ర్ త‌ప్ప మ‌రో పాత్ర‌కు చోటు లేదు. అంద‌రూ ఇలా వ‌చ్చి అలా వెళ్లేవారే. నితిన్ ఎప్ప‌ట్లా ఈజ్‌తో న‌టించాడు. కానీ చేసిన పాత్రే చేసేస‌రికి త‌న యాక్టింగ్‌లోనూ బోర్ కొట్టే ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. డాన్స్ లో ఎలాంటి లోటూ చేయ‌లేదు. గేగా కాసేపు న‌టించాడు.
మిస్తీ చూడ్డానికి అందంగానే ఉంది. ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో వీక్‌. క‌రుణాక‌ర‌ణ్ సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ సూప‌ర్ హిట్టే. అయితే ఇందులో మాత్రం యావ‌రేజ్‌! సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, నాజ‌ర్‌, రోహిణి, సితార, అలీ.. సీరియ‌ర్లే కాబ‌ట్టి బండి న‌డిపించేశారు.

ఇష్క్‌, గుండెజారి.. విజ‌యాల్లో అనూప్ సంగీతం కీల‌క పాత్ర పోషించింది. ఆ రెండు సినిమాల్లోనూ పాట‌ల‌తో మ్యాజిక్ చేసిన అనూప్‌.. ఈసారి మాత్రం తేలిపోయాడు. నాసిర‌క‌మైన క‌థ‌కు క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నుకొన్నాడేమో ఏమాత్రం కిక్ ఇవ్వ‌ని ట్యూన్స్ ఇచ్చాడు. ఆండ్రూ కెమెరా మాత్రం ప్ర‌తి సీన్‌నీ అందంగా చూపించింది. యూర‌ప్ అందాల్ని క‌ట్టిప‌డేసింది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ పంచ్‌లు ఈసారి పెద్ద‌గా పేలలేదు. క‌రుణాక‌ర‌న్ క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా, స్ర్కీన్ ప్లే ర‌చ‌యిత‌గానూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడీ సినిమాతో.

ప్రేమ క‌థంటే అబ్బాయి అబ్బాయి ఉంటే స‌రిపోదు. వాళ్ల‌మ‌ధ్య ఉన్న ప్రేమ‌లో ఎమోష‌న్ ఉండాలి. అది ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావాలి. లేదంటే బాక్సాఫీసు ద‌గ్గ‌ర అలాంటి క‌థ‌ల‌న్నీ డిస్క‌నెక్ట్ అయిపోతాయి. చిన్న‌దాన నీకోసం ప‌రిస్థితీ అంతే!

రేటింగ్ 2